గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా పరిశీలించారు. గతంలో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో.. కేసీఆర్ రంగంలోకి దిగక తప్పని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు ఇటీవలే దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం.. ఆ పార్టీ ప్రతిష్టను బాగా దిగజార్చింది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ఆ తప్పు జరగకూడదనే ఉద్దేశ్యంతో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.
సాధారణ ఎన్నికల్లో ఇచ్చినట్టే.. అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికల కోసం ఉచిత హామీలను గుప్పించింది. అయితే వాటికి సానుకూల స్పందన రాకపోగా.. అధికారంలో ఉండి కూడా వాటిని ఎందుకు అమలు చేయలేదన్న విమర్శలు ఎదురయ్యాయి. మరోవైపు వరద సాయంపై అధికార పార్టీ నేతలను జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్.. గ్రేటర్ ప్రచారంలోకి అడుగుపెట్టక తప్పని పరిస్థితి వచ్చింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న జరుగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 4న వెలువడనున్నాయి.