గజం లక్షన్నరకు పైగా పలికే భూమి… కానీ సర్కార్ భూమి. సర్కార్ భూమి అయితే మనకేంటీ… అధికారంలో ఉన్నది మనవాళ్లే కదా అనుకున్నట్లున్నారు. హాఫీజ్ పేట ప్రభుత్వ భూముల్లో కేసీఆర్ బంధువులు వాలిపోయారు. సర్కార్ చేతిలో ఉంది కాబట్టి డాక్యుమెంట్లు కూడా రెడీ అవుతున్న సందర్భంలో… రాయలసీమకు చెందిన వారు ఎంటరైపోయారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పేరుతో అర్ధరాత్రి అలజడి రేగింది.
సర్కార్ భూమి పంపకాల్లో తేడాల వల్లే ఈ అర్ధరాత్రి బెదిరింపులు, కిడ్నాప్ లు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 50ఎకరాల భూమి విషయంలో వీరి మధ్య వివాదం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అంటే కొన్ని వందల కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసే విషయంలో ఏర్పడ్డ వివాదమే ఇదన్నది ఆ ప్రచార సారాంశం.
ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే… సర్కార్ భూమి విషయంలో జరిగిన కిడ్నాప్ ఉదాంతంలో పోలీసులు వేగంగా స్పందించారు. ఏకంగా సీపీ అంజనీకుమార్ రాత్రిపూట ఘటన స్థలంలోకి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ఎన్నో కిడ్నాప్ లు, పరువు హత్యలు జరుగుతున్నాయి. అవి జరిగిన ప్రతిసారి పోలీసుల నిర్లక్ష్యం ఉందని, ప్రాణహాని ఉందని చెప్పినా లైట్ తీసుకున్నారన్న ఆరోపణలు వినపడతాయి. ఇక్కడ మాత్రం సీఎం బంధువులు కావటంతో పోలీసులు వేగంగా స్పందించారని, ఇదే కిడ్నాప్ ఓ సామాన్యుడికి జరిగితే ఇలా స్పందించేవారా…? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అయితే, సీఎం బంధువులు మాత్రం అది ప్రభుత్వ భూమి కాదని… ఇందులో చాలా మంది భాగస్వాములున్నారని చెప్పటం విశేషం.