దళిత బంధుతో హుజురాబాద్‌ను ఎలాగైనా వశం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందు జాగ్రత్తపడుతున్నారు. కోర్టు కేసులు, ఈసీ బ్రేకులు.. అనే మాటలు వినబడకుండా తొందరపడుతున్నారు.
ఆగస్ట్ 16న హుజురాబాద్‌లో అట్టహాసంగా దళిత బంధుకు శ్రీకారం చుట్టాలని భావించిన సీఎం.. ఎందుకైనా మంచిదని అంతకంటే ముందే నిధులు విడుదలకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద రూ.500 కోట్లను విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ముఖ్యమంత్రి ఇంతలా తొందరపడటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
త్వరలోనే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందునే.. ఆగమేఘాల మీద కేసీఆర్ నిధులను మంజూరు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు రెండు, మూడు రోజుల క్రితం హుజురాబాద్‌లో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేకంగా వైద్య బృందాలను కూడా పంపి.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించడం.. ఇందుకు బలాన్నిస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్, ఆ వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతోనే.. కేసీఆర్ ఇలా తన ప్లాన్‌ను ముందే అమల్లోకి తీసుకొస్తున్నారేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు.