ఆర్టీసీ కార్మికుల సమ్మె, మిలియన్ మార్చ్‌తో సీఎం కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా…? నన్నే ఎదిరిస్తారా అనుకొని పొరపడ్డారా…? కేంద్రం దూకుడుతో కేసీఆర్ షాక్‌కు గురైయ్యారా…? అంటే అవుననే అంటున్నాయి టీఆరెఎస్ వర్గాలు.
నన్ను కాదని… ఎక్కడకు వెళ్తారు, నన్నే ఎదురిస్తారా అన్న భావనలో ఉన్న సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికులు కొరకరాని కొయ్యలా మారుతున్నారు. ఓవైపు కోర్టులు మొట్టివేయటం, మరోవైపు ఐఏఎస్ అధికారులు కూడా ఇంకెన్నాళ్లు ఇలా కోర్టులో క్షమాపణలు చెప్పాలంటూ అసంతృప్తిగా ఉండటానికి తోడు, కేంద్రం కూడా సరైన సమయంలో గట్టి దెబ్బకొట్టడంతో సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. లోతు తెలియకుండా నదిలోకి దిగిన చందంగా తయారైపోయింది మా పరిస్థితి అంటూ గులాబీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
నిజానికి… కేంద్రం వరకు విషయం వెల్లదు, వీళ్లు మళ్లీ నా దగ్గరకు రావాల్సిందే కదా అన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్‌కు, అసలు మమ్మల్ని అడగకుండా ఆర్టీసీ విభజన ఎట్లా జరుగుతుంది, మా దృష్టిలో తెలంగాణ ఆర్టీసీయే లేదంటూ కేంద్రం ఎదురు తిరగటంతో సీఎం కేసీఆర్ షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. అందుకే శుక్రవారం రాత్రి సమీక్షలో కూడా కేంద్రం ఇలా మాట్లాడుతుందని అనుకోలేదని వ్యాఖ్యానించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడేం చేద్దాం… కేంద్రంతో సయోధ్యతో ఆర్టీసీ అంశానికి తెరదించే అవకాశం ఉందా, లేక ఆర్టీసీ కార్మికులతోనే చర్చలు జరిపి… విన్-విన్ సిట్యూయేషన్ క్రియేట్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల అంశాలపై కేసీఆర్ అండ్ టీం దృష్టి పెట్టినట్లు కనపడుతోందని…. ముఖ్యంగా మిలియన్ మార్చ్ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల తెగువ తర్వాత ఇంకా లాగటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.