మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో 36 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 4,18,960 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,56,024 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1087.9 అడుగులుగా కొనసాగుతోంది. ఇటు కాళేశ్వరం నుంచి కూడా దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో భద్రాచలం దగ్గర నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. 53.80 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి ఉద్ధృతిపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లపై చర్చించారు. మహారాష్ట్ర ఎగువ గోదావరి వరదను అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా రక్షణ చర్యలపైనా చర్చలు జరిపారు సీఎం.
కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నా వరద పెరుగుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించామని తెలిపారు. నిర్మల్ సహా ఇతర వరద ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ప్రాణహాని జరగకుండా సత్వర చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలో ఉండి పరిస్థితి పర్యవేక్షించాలని మంత్రి పువ్వాడకు స్పష్టం చేశారు కేసీఆర్.
ఇటు వర్షాలకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో దానిపైనా చర్చలు జరిపారు. మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. రక్షణ చర్యలకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.