తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలను ఎలా నిర్వహించాలనే విషయంపై కలెక్టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
దీంతో పాటు పోడు పట్టాల పంపిణీ, హరితహారం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వంటి అంశాల్లో ప్రభుత్వం తరఫున ఎలా ముందుకు వెళ్లాలో అధికారులకు వివరించారు.
గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు ప్రతి రోజూ నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి కలెక్టర్లతో సీఎం చర్చించారు. ఏరోజు ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు సీఎం సూచించారు. దశాబ్ది ఉత్సవాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
దశాబ్ది ఉత్సవాలకు నిర్వహణకు సంబంధించిన ఖర్చుల కోసం జిల్లా కలెక్టర్లకు రూ. 105 కోట్ల నిధులను విడుదల చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, సీఎం, సీఎంవో సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు, డీజీపీ, జిల్లా ఎస్పీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.