తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యవహరిస్తున్న తీరు రాజకీయవర్గాలనే కాదు.. సామన్య జనాన్నీ ఆశ్చర్యపరుస్తోంది. అవసరం లేకపోయినా సరే.. సందర్భాన్ని సృష్టించుకుని మరీ ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటం విచిత్రంగా మారింది. ప్రజల్లో పార్టీ గ్రాఫ్ పడిపోతోందన్న ఆందోళనో లేక ప్రత్యర్థుల బలపడుతున్నారన్న భయమో తెలియదు కానీ.. గతంలో ఎన్నడూలేని విధంగా రోజల తరబడి ప్రగతి భవన్‌ను వదిలేస్తున్నారు. మొన్నే ఓసారి పలు జిల్లాలు చుట్టొచ్చిన ముఖ్యమంత్రి.. తాజాగా మిగిలిన జిల్లాలను కవర్ చేసే ప్లాన్ చేస్తున్నారు.
ప్రగతి భవన్ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెలఖారు నుంచి కేసీఆర్ వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. కొన్ని చోట్ల కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌ల ప్రారంభోత్సవం, మరికొన్ని చోట్లకు కొత్తగా ప్రకటించిన మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన కోసం వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం కేసీఆర్ పర్యటన షెడ్యూల్‌ను ఇంకా ధృవీకరించనప్పటికీ, నెలాఖరులోగా లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కేసీఆర్ మరోసారి ప్రగతి భవన్ నుంచి అడుగుపెట్టడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
మే, జూన్ నెలల్లో వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలను సందర్శించారు కేసీఆర్. వాసాలమర్రి కోసంయాదాద్రి భువనగిరి, హుజరాబాద్లో దళిత బంధు ప్రారంభోత్సవం కోసం కరీంనగర్ జిల్లాల్లో అడుగుపెట్టారు. వచ్చే పర్యటనలో నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, జనగాం, వికారాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలను సందర్శిస్తారు. ఆయా జిల్లాల్లో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను ప్రారంభిస్తారు. అలాగే వివిధ జిల్లాలకు ప్రకటించిన మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేస్తారు. వాస్తవానికి కేసీఆర్ ఈ కార్యక్రమాలను స్థానిక మంత్రులకే అప్పగించాలని అనుకున్నారని తెలుస్తోంది. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు ఆయననే స్వయంగా జిల్లాలకు రప్పిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.