ఆర్టీసి సమ్మె , ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యాన్ని, విస్మయానికి గురిచేస్తోంది. మొదటి 5 సంవత్సరాల కాలంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు , ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు సానుకూలంగా స్పందించిన కెసిఆర్ లో ఎందుకింత మార్పు అని చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. కాలికి ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తాను అన్న కెసిఆర్ ఏమై పోయాడు అని మాట్లాడుకుంటున్నారు. బొంత పురుగు ను సైతం ముద్దు పెట్టుకుంటానన్న కెసిఆర్ , సొంత తెలంగాణ బిడ్డలను అసహ్యించు కుంటున్నారు ఎందుకీ పరిస్థితి అని బాధ పడుతున్నారు.
ఒకటి కాదు ..రెండు కాదు 50 వేల కుటుంబాలు. అంటే దాదాపు ప్రత్యక్షంగా 3లక్షల మంది ప్రజలు. వీళ్లంతా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు అని మాట్లాడుతుంటే, మిగతా మూడున్నర కోట్ల మంది ప్రజలు ఆ కార్మికులకు ఏమని చెప్పగలరు. మీకు మేమున్నాం అని భరోసా ఇవ్వడం తప్ప. ఇప్పుడు తెలంగాణ సమాజమంతా ఆర్టీసి కార్మికులకు అండగా నిలబడింది.నిలబడుతుంది.
తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు.పిడికిలి బిగించి నిజాం ను తరిమికొట్టిన చైతన్యం తెలంగాణ ప్రజలది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మంచే చేస్తారని ఇంకా ఆశతో ఉన్నారు.