టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. వరుస పేపర్ లీకేజీలను నిరసిస్తూ గురువారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. భారీ ర్యాలీగా తరలివచ్చిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముందు బైఠాయించారు.
దీంతో కలెక్టరేట్ ప్రాంతమంతా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. స్టూడెంట్స్ ని అదుపుచేయడం కోసం పోలీసులు.. నాయకులను, కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు.
అనంతరం ఏబీవీపీ నాయకుడు సురేష్ కమల్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శులను కలెక్టర్ అనిత రమచద్రన్ వెంటనే బర్తరఫ్ చేయాలని, పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తరం విద్యార్థుల జీవితాలను నాశనం చేశాడని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత.. ఆదరబాదరగా ఒకటేసారి 17 ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి టీఎస్‌పీఎస్సీతో కుమ్మక్కై వందల కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు ఏబీవీపీ నాయకుడు సురేష్.