ఆర్టీసీ కార్మికులంతా… మేం సమ్మె విరమిస్తాం, విధుల్లోకి రావడానికి సిద్ధమని స్పష్టం చేసినా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా… సానుకూల నిర్ణయం తీసుకొని, తన గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడుకోవాలి కానీ ఇలా మొండిగా ప్రవర్తించటం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ తాతయ్య… ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు, దసరా-దీపావళి పండుగకు అమ్మ కొత్త బట్టలు కూడా కొనివ్వలేదు… నా ఫ్రెండ్స్ అంతా సంతోషంగా పండుగ చేసుకుంటే నేను మాత్రం ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయా, తాతయ్య అమ్మకు జీతం ఇవ్వరా అని ఓ చిన్నారి ఏడుస్తూ అడిగినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. నిజానికి చాలా మంది కార్మికుల ఇంట్లో ఇలాంటి సందర్భాలే ఉన్నాయి. అంతలా ఓ చిన్నారి ప్రాదేయపడినా మీ మనస్సు కరగటం లేదా అంటూ సీఎం కేసీఆర్ పొగిడే నోర్లు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి.
మేం సమ్మె విరమిస్తాం అని ప్రకటన రాగానే… సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండ్రోజుల్లో హైకోర్టులో ఆర్టీసీ రూట్ ప్రైవేటీకరణ అంశం తేలనివ్వండి, చూద్దాం అని చెప్పారు. కానీ అది తేలిపోయినా… సీఎం కేసీఆర్ మాత్రం కార్మికుల అంశంలో తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో.. అసలు కేసీఆర్ దీనిపై ప్రకటన చేస్తారా, చేయరా… అన్న సందిగ్ధత అలాగే ఉంది.
అయితే, సీఎం కేసీఆర్ మాత్రం… సమ్మె విరమిస్తాం అని ప్రకటన చేసిన మరుసటి రోజే సమ్మె కొనసాగుతుందని చేసిన ప్రకటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకో మాట మాట్లాడుతుంటే ఇంకేం నిర్ణయం ఉంటుంది, చూద్దాం ఇంకెన్ని రోజులు చేస్తారో అన్న భావనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కానీ సీఎం కేసీఆర్ సగటు కార్మికున్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, లేబర్ కోర్టు వరకు సమ్మెను సాగదీయకపోవటం మంచిదని… సీఎం హుందాతనం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.