కేసీఆర్ ఢిల్లీ టూర్ నుండి తిరిగొచ్చారు. అక్కడ ఏం జరిగింది, కేసీఆర్ ఏం ఆలోచించారు అన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ వస్తూ వస్తూనే అతి త్వరలో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాం… ఫైల్ రెడీ చేయండి అంటూ ఆర్డర్ వేశారు. అంతేనా ప్రమోషన్ల జాబితా తీసి ఖాళీలను గుర్తించండి అంటూ ఆర్డర్. దీంతో నిరుద్యోగులంతా పుస్తకాల దుమ్ము దులిపి… కోచింగ్ సెంటర్ల వెంట పరుగుతీశారు.
ఇటు రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఉద్యోగులను కూడా కేసీఆర్ కదిపారు. పీఆర్సీ వెంటనే అమలు చేస్తాం, ప్రమోషన్లు ఇచ్చి మరీ జీతాలు పెంచుతాం… అంతేకాదు 60ఏళ్లకు పదవీ విరమణ వయస్సు కూడా పెంచేస్తున్నాం అని చెప్పేశారు.
కేసీఆర్ ప్రకటనలు చేసి రెండు నెలలవుతుంది. ఉద్యోగాల ఊసే లేదు. ఒకట్రెండు రోజులు హాడావిడి చేసిన అధికారులు సైలెంట్ అయిపోయారు. పీఆర్సీ కూడా నివేదిక ఇవ్వటం, కావాలనే సడే సాత్ పీఆర్సీని బయటపెట్టడం, గొడవలు… అలా అది కూడా సైలెంట్ అయ్యింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మార్చిలో ఎన్నికలు అయిపోతాయిలే అనుకోవటానికి అస్సలు లేదు. ఎందుకంటే సాగర్ ఎన్నిక కూడా వచ్చేసింది. సో ఎంతకాదన్న… మరో మూడు నెలల పాటు అంతా సైలెన్స్.
నిజానికి ఉద్యోగాల గురించి, జీతాల పెంపు గురించి కేసీఆర్ ను గట్టిగా అడగటమే మానేశారు. అలాంటిది ఆయనే తేనేతుట్టేను కదిపి, ఆయనే ప్రకటనలు చేసి…. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని సైలెంట్ అయిపోతే ఎలా అని నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేరు చేసే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ నిరుద్యోగులనే కాదు ఉద్యోగులను కూడా పూర్తిగా దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.