కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర విద్యుత్ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. 2020లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన సవరించిన విద్యుత్ బిల్లులో.. రాష్ట్ర ప్రభుత్వం పలు కేటగిరీల వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలను రద్దు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదన్నారు. మేం సబ్సిడీలు ఇస్తుంటే కేంద్రం తొలగించమంటోంది అంటూ జరుగుతున్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అంత్యోదయ అనే సిద్ధాంతంపైనే పుట్టిన బీజేపీ పేదలకు అన్యాయం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించదని అన్నారు. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు.
రఘునందన్ మాట్లాడాక సీఎం కేసీఆర్ మైక్ అందుకున్నారు. కేంద్రంపై మండిపడ్డారు. ఉన్న విద్యుత్ ను ఇచ్చే తెలివి కూడా కేంద్రానికి లేదన్నారు. తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. దీన్ని ఎలాగైనా బంద్ పెట్టేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడే కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చిందని.. 8 ఏళ్లలో తలసరి విద్యుత్ వినియోగం 970 నుంచి 2126 యూనిట్లకు పెంచామని తెలిపారు. దేశంలో తలసరి విద్యుత్ వినియోగం 950 నుంచి 1250 యూనిట్లకు మాత్రమే పెరిగిందని వివరించారు. తెలంగాణలో 1156 యూనిట్లకు పెరిగితే దేశం మొత్తంలో 521 యూనిట్లే పెరిగిందన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో ప్రపంచంలో 104వ స్థానంలో ఉన్నామని చెప్పారు.
కేంద్రం అన్నీ అమ్మేస్తోందని.. వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలాయని మండిపడ్డారు కేసీఆర్. సంస్కరణల పేరుతో వాటిని అమ్మేందుకు చూస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మాట మాత్రం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేశారని ఆరోపించారు. లోక్ సభలో కూడా మాట్లాడే పరిస్థితి లేదని, తిరిగి విపక్షాలపైనే దాడులు చేసే పరిస్థితి ఉందని అన్నారు. విద్యుత్ సంస్కరణల ముసుగులో రైతులను దోచేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని ఫైరయ్యారు. ఏపీలోని శ్రీకాకుళంలో కేంద్రం విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టిందని తెలిపారు. దాంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ధర్నా చేపట్టారని వివరించారు.
విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని అసహనం వ్యక్తం చేశారు సీఎం. ఆర్డినెన్స్ తో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను లాక్కున్నారని.. సీలేరు పవర్ ప్లాంట్ నూ లాక్కున్నారని, ఆ సమయంలో ప్రధానిని వ్యతిరేకించిన వారిని తానొక్కడినే అని గుర్తు చేశారు. మోస్ట్ ఫాసిస్ట్ అని ప్రధానిని ఆనాడే అన్నట్లు చెప్పారు. ఎదుటివాళ్లు చెబితే వినే సంస్కారం బీజేపీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర బిల్లును ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎలా సమర్థిస్తారో ఆయనే ఆలోచించుకోవాలని సూచించారు. ఆర్టీసీని అమ్మేయాలని లెటర్లు వస్తున్నాయని, అమ్మితే వెయ్యి కోట్ల బహుమతి ఇస్తామంటున్నారని తెలిపారు.
తెలంగాణలో బీజేపీకి ఉంది ముగ్గురు ఎమ్మెల్యేలే అని.. మమ్మల్ని తీసేస్తాం అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోయేకాలం వచ్చింది కాబట్టే అలా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. సైన్యంలో మార్పులు చేస్తే దేశం రగిలిపోయిందని.. అప్పటికప్పుడు పోలీసులతో అణిచివేయవచ్చని.. కానీ, యువకుల గుండెల్లో రగిలే మంటలను ఎలా ఆర్పుతారని నిలదీశారు. దుబ్బాకలో పండే పంటను సిద్దిపేటలోనే అమ్మే పరిస్థితి ఉండదని.. కేంద్రం ఎక్కడైనా అమ్ముకోవచ్చని మాయమాటలు చెబుతోందని అన్నారు. రైతులు వ్యవసాయం చేయలేమంటే, కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దించవచ్చనేదే కేంద్రం ఆలోచనగా చెప్పారు కేసీఆర్.