చాలా రోజుల తర్వాత మీడియా ముదుకొచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎప్పటిలాగే కేంద్రంపై తన మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా నీతి ఆయోగ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. ఈ మేరకు కేంద్రం తీరును నిరసిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాసినట్లు తెలిపారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని.. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24వేల కోట్లు ఇవ్వమంటే 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు కేసీఆర్. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వనప్పుడు ఆ సంస్థ ఎందుకని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తెచ్చిందని.. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు బ్రేక్ పడుతుందని వివరించారు. నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయిందని.. అక్కడ మేధోమథనం జరగడం లేదు.. భజన బృందంగా మారిందని విమర్శించారు.
8 ఏళ్లలో నీతి ఆయోగ్ సాధించింది ఏమీ లేదన్న కేసీఆర్.. రూపాయి విలువ పాతాళానికి పడిందని దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శలు చేశారు. 13 నెలల తర్వాత రైతు చట్టాలు రద్దు చేశారని.. అది 13 రోజుల్లోనే చేసి ఉండొచ్చని అన్నారు. రైతుల పెట్టుబడి డబుల్ అయిందన్న సీఎం.. సంపాదన మాత్రం డబుల్ కాలేదన్నారు. ప్రధాని ఇచ్చిన ఏ హామీ నెరవేరడం లేదని ఆరోపించారు. ఢిల్లీలో కూడా నీళ్లు దొరకడం లేదని.. నీతి ఆయోగ్ ఏం చేసిందని ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ ను తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చి ఏం సాధించారని నిలదీశారు.
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందన్నారు కేసీఆర్. ఫెడరల్ స్ఫూర్తి పోయి.. తామే ఏం చెబితే అది చేయాలనే వరకు పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఒకవేళ చెప్పింది చేయకపోతే.. మీ కథ చూస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు. ట్యాక్సులకు సెస్ లనే పేరు మార్చి రాష్ట్రాల నిధులను కేంద్రం కొల్లగొడుతోందని ఆరోపించారు. నీతి ఆయోగ్ మీటింగ్ లో సీఎంలకు కూడా టైమ్ పెట్టి అయిపోగానే బెల్ కొడుతుంటారని.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రాలకు కాళ్లు అడ్డం పెట్టకుండా ప్రోత్సహించాలనేదే తన తాపత్రయమని తెలిపారు కేసీఆర్.