– కంటి వెలుగు ఓట్ల కోసం కాదు
– పథకాల వెనుక ఎంతో మేధోమథనం ఉంటుంది
– ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు
– ఉన్నన్నాళ్లు ఎంత మంచి చేశామన్నదే ముఖ్యం
– ఉద్యమ సమయంలో ఎన్నో బాధలు పడ్డాం
– ఏడేళ్లలో విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ గా మారాం!
– మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలో 7 ఏళ్ల క్రితం కరెంట్ బాధలుండేవన్నారు సీఎం కేసీఆర్. కానీ, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కలెక్టర్ వెంకట్రావును సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సంక్షేమంలో తెలంగాణకు ఏ రాష్ట్రం పోటీలో లేదని తెలిపారు కేసీఆర్. ఓనాడు వేదనతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో రూపాంతరం చెందుతోందని చెప్పారు. ఉద్యోగులు సంతృప్తితో పనిచేయాలని.. మరో దఫా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. ఎవరూ వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదని.. పని చేసినంత కాలం గుర్తింపు ఉండేలా చేయాలని చెప్పారు. ఒక స్టేజీ తర్వాత ఉద్యోగులూ రిటైర్డ్ కావాల్సిందేనని.. ఉన్నప్పుడే ఏం చేసిందనేదే ఎండ్ ఆఫ్ ది డే అని తెలిపారు.
ఉద్యమ సమయంలో నడిగడ్డ ప్రజల బాధలను చూసి చలించిపోయానని.. రాష్ట్రంలో సంస్కరణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు కేసీఆర్. కంటి వెలుగు ఓట్ల కోసం పెట్టిన కార్యక్రమం కాదని.. ఎంతోమందికి ఈ పథకం ద్వారా చూపు లభించిందని తెలిపారు. ఏడేళ్ల క్రితం 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 3 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏ తెలంగాణ కావాలనుకున్నానో.. ఆ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని చెప్పారు సీఎం. పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషమని.. వేదనలు, రోదనలతో బాధపడ్డ జిల్లా ఈరోజు సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా సమగ్రమైన అధ్యయనం తర్వాతే మొదలుపెడుతున్నామని తెలిపారు. గవర్నమెంట్ మానవీయ కోణంలో ఏ పని చేసినా దాని వెనుక చర్చ, మథనం, ఆలోచన, స్పష్టమైన అవగాహన, దృక్పథంతో చేస్తామన్నారు కేసీఆర్.