ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వలసలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు జిల్లా అభివృద్ది పథంలో ముందుకు పోతుందన్నారు. అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించుకున్నామన్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లాలో ఎక్కడ చూసినా కరువు, ఆకలి కేకలు ఉండేవన్నారు. ఇప్పుడు పాలమూరు అంటే పచ్చబడిన జిల్లా అంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించడం గర్వకారణమన్నారు. సమైక్య పాలకులు మనల్ని నిరాదరణకు గురి చేశారని చెప్పారు. పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమంలో ఇప్పుడు మనకు సాటి ఎవరూ లేరన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ, పారిశ్రామిక హబ్ గా మారుతోందన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో మన వాటా తేల్చమంటే కేంద్రం తేల్చడం లేదన్నారు. మహబూబ్‌నగర్‌కు క్రీడా మైదానం, ఆడిటోరియం మంజూరు చేస్తామన్నారు. ప్రతి వర్గానికి ఒక కార్యక్రమం చేపట్టి ఆదుకుంటున్నామన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో సరిహద్దులోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు హామీ ఇస్తే బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళతామని అన్నారు. నేను మీతో ఉంటాను… మీరు నాతో ఉండాలి. తెలంగాణ లాగా భారత్ ను కూడా అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారికి అడ్డంకులు సృష్టిస్తుంటారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కారణంగా తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాలను కూల్చివేయడం మోదీ విధానమా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏం జరుగుతోందో గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చ జరగాలని, దేశ పరిణామాలపై యువత, మేథావులు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
23 కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం కొత్త కలెక్టరేట్ ల ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే ఈ అభివృద్ది సాధ్యపడిందన్నారు. కరువు జిల్లాగా పాలమూరు.. ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండ.. ఎండిపోయిన జిల్లాగా రంగారెడ్డి ఉండేవి. ఈ 3 జిల్లాలో పారే కృష్ణ నదిపై వాటా తెల్చమంటే 8 ఏళ్లు గడిచినా మాట్లాడడమే లేదన్నారు. ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమయ్యిందన్నారు. ఈ రోజు దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు. 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే.. పోటీ చేయనని చెప్పారు. తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా.. కాలర్ ఎగరేయాలన్న లక్ష్యంతోనే రైతు బంధు ఇస్తున్నామన్నారు. గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ ఉండదు.. మంచినీటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. మోడీ స్వయంగా కేసీఆర్ నీ ప్రభుత్వాన్ని కులగొడతా అంటున్నారు. అనేక మంది త్యాగాలతో స్వతంత్రం తెచ్చుకున్నది ఇందుకోసమేనా? ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు.. ఉన్నవన్నీ ప్రైవేట్ సెక్టార్ కు అమ్మేయడమేనా ప్రగతి? చిల్లర ఎత్తుగడలను ప్రజలు గమనించాలన్నారు.
త్వరలో పాలమూరు రంగారెడ్డి అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటివరకూ 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఈ జిల్లాకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. 14 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఏసీడీపీ నిధులు మరో రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నా అని తెలిపారు. గతంలో రూ.5 కోట్లు మంజూరు చేశాం. నియోజకవర్గానికి 1000 ఇళ్ల చొప్పున అదనంగా మంజూరు చేస్తామన్నారు. అద్భుతమైన పాలమూరు నిర్మించుకుందామని తెలిపారు. చెక్ డ్యామ్ లు ఇంకా కట్టాలన్నారు. త్వరలోనే అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటన చేపడతానన్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర వహిద్దామని వెల్లడించారు కేసీఆర్.
కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలులో పెట్టించామన్నారు. అత్యంత నియంతృత్వంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దేశంలో ఎక్కడో ఒక చోట బీజేపీ ప్రజా వ్యతిరేక పోకడలకు వ్యతికంగా యుద్ధం ప్రారంభం కావాలని, ఆ యుద్ధం మనమే ప్రారంభిద్దామని ఆయన పిలుపునిచ్చారు.