– దేశ్ కీ పార్టీపై కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు
– భారత రాష్ట్ర సమితి అంటూ హింట్
– ఒకవేళ బీఆర్‌ఎస్ వస్తే నెట్టుకొస్తారా?
– ఉన్న ఎంపీ సీట్లెన్ని?
– మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీలెన్ని?
– కేసీఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా?
ప్లీనరీ సమావేశం అంటే ఏం చేస్తారు.. తమ పార్టీ బలోపేతం.. సాధించిన విజయాలు.. ప్రజలకు అందిన ఫలాల గురించి చర్చిస్తారు. ఆ విధంగానే తీర్మానాలను కూడా ఆమోదం తెలుపుతుంటారు. కానీ.. మన దేశ్ కీ నేత కేసీఆర్ మాత్రం అలాకాదు.. 11 తీర్మానాలు చేస్తే అందులో 9 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేవే ఉన్నాయి. అయితే.. తమ భవిష్యత్ కార్యాచరణ అంతా కేంద్రంపై యుద్ధమనే సంకేతాలను కేసీఆర్ ఇలా ఇచ్చారని అంటున్నారు గులాబీ శ్రేణులు. తీర్మానాల సంగతి పక్కనపెడితే.. ప్లీనరీలో ముఖ్యంగా హైలెట్ అయిన అంశం భారత రాష్ట్ర సమితి.
ఆ ఫ్రంట్.. ఈ ఫ్రంట్ అంటూ కొద్ది రోజులు హడావుడి చేశారు కేసీఆర్. కానీ.. ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరూ ఆయన్ను పట్టించుకోలేదు. కాంగ్రెస్ లేని కూటమి కష్టమని కొందరు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అదే సమయంలో అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెడితే తప్పేంటని అన్నారు కేసీఆర్. దీంతో ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని.. ప్లీనరీలో కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అందరూ ఎంతో ఆసక్తిగా కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూశారు. కానీ.. ఆయన ప్రసంగం చూసిన తర్వాత చల్లబడ్డట్టే అనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన లేకపోయినా పరోక్షంగా మాత్రమే కేసీఆర్ హింట్ ఇచ్చారు.
ఫ్రంట్, కూటమి ఏర్పాట్లకు వ్యతిరేకమని.. ఎవరినో గద్దెనెక్కించడానికి, దించడానికి ప్రయత్నాలు జరగాలా అని ప్రశ్నించారు కేసీఆర్. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం వేదికైతే అది మనందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని చెప్పారు. అయితే.. ఈ పేరును ఆయన అంత ఆషామాషీగా ప్రస్తావించి ఉండరనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పండితులు. కొత్త పార్టీ పెడితే దాదాపు ఇదే పేరు ఖరారు కావొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ.. ఈ సందర్భంగా కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ అవసరం ఉందా? అనేది మొదటి ప్రశ్న. అసలు.. ఇది సాధ్యమేనా? కార్యరూపం దాల్చుతుందా? అనే సందేహాలను వెలిబుచ్చుతున్నారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. వారిలా తాను కూడా చేయాలని కేసీఆర్ భావించాలని అనుకుంటే.. విశ్వశనీయత, ఎంపీల సంఖ్య చాలా కీలకమని చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో అంటే వేరు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీకి ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండేవి.. అధికార పక్షానికి ఓ రేంజ్ సీట్లు మాత్రమే ఉండేవి. ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. బీజేపీకి తిరుగులేని స్థానాలు ఉన్నాయి. ఇటు కేసీఆర్ పార్టీకి ఉన్న సీట్లు చాలా తక్కువే.. ఇతర పార్టీల నుంచి ఉన్న మద్దతూ తక్కువే అని గుర్తు చేస్తున్నారు.
ఒకవేళ కేసీఆర్ బీఆర్‌ఎస్ స్థాపిస్తే.. ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. మరి.. వాటికి వ్యతిరేకంగా వెళ్తారా? లేక కలిసిపోతారా? కలిస్తే మనుగడ కష్టమని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు. ఏ పార్టీని నమ్మాలన్నా క్రెడిబులిటీ కీలకం. కానీ.. కేసీఆర్ ను ఇప్పుడే ఇతర పార్టీలు పట్టించుకోవడం లేదు. అందుకే.. ప్లీనరీలో ప్రకటన లేకుండా పరోక్షంగానే కామెంట్స్ చేశారని అంటున్నారు. అసలు.. బీఆర్‌ఎస్ వచ్చినా మనుగడ సాధ్యం కాదని చెబుతున్నారు. ఇదంతా చూసి కేసీఆర్ క్లారిటీ లేకుండా.. కన్ఫ్యూజన్ లో ఉన్నారని అర్థం అవుతోందని వివరిస్తున్నారు విశ్లేషకులు.