భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ఉద్యమ రోజులను గుర్తుకు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైల్లో పెట్టారని తెలిపారు. అప్పుడు స్థానిక ప్రజలు ఎంతో పోరాటం చేసి తనను కాపాడుకున్నారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, అందరి ఐక్య పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు.
దేశాన్ని రక్షించుకునేందుకు ఖమ్మం నుంచి శంఖారావాన్ని పూరించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వాటర్ పాలసీతో రాష్ట్రాలు జుట్లు పట్టుకుంటున్నాయని విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మంచినీళ్లు రావు.. కరెంటు రాదు.. కానీ ఉపన్యాసాలు వింటే మాత్రం టీవీలు బద్ధలైపోతాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్పా భారతదేశంలో ఏయే రాష్ట్రంలో, ప్రధాని సొంత రాష్ట్రం సహా 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మంచినీరు ఇవ్వరు.. సాగునీరివ్వరు.. కరెంటు ఇవ్వరు.. ఉద్యోగాలు ఇవ్వరు.. ఉపన్యాసాలు వినాలా? ఎన్ని రోజులు వినాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వరాల జల్లు కురిపించారు. సీఎం హామీలు ఇస్తుండగా జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన సీఎం.. ఇక్కడ కొత్త రకంగా అరుస్తున్నారు. సర్కస్ లెక్క.. ఇదేం అరుసుడు అని కామెంట్స్ చేశారు. కాగా జిల్లాలోని 481 గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని ఆయన ప్రకటించారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు రూ.40 కోట్లు, మణగూరు, ఇల్లందు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి కేసీఆర్.