-కనీస మద్దతు ధర రూ.1960 కే!
– ఒక్క రూపాయి తక్కువ కూడా అమ్మొద్దు
– బలమైన కేంద్రం..బలహీన రాష్ట్రాలు ఇదే విధానం
– కేంద్రమంత్రులది నోరా..మోరీనా!
– చిన్నరాష్ట్రం..రైతులను ఆదుకోలేరా!
– పీయూష్ గోయల్ కు బుద్ధి ఉందా!
– బియ్యం కొనమంటే..నూకలు తినమంటారా!
– మోడీ సర్కార్ వి అన్నీఅబద్ధాలే
– బడా బ్యాంక్ చోర్ లు లక్షలు దోస్తే వదిలేస్తారు
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.యాసంగి ధాన్యాన్నితెలంగాణ ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం తీసుకుంటామని తెలిపారు.బాయిల్డ్ రైస్ ఎగుమతి చేస్తూ..చేయట్లేదని మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందన్నఆయన..యాసంగి ధాన్యం మిల్లింగ్ చేస్తే క్వింటాల్ కు 67 కిలోల బియ్యం రాదని అన్నారు.యాసంగిలోనూ క్వింటాల్ కు 67 కిలోల బియ్యం ఇవ్వాలంటే కుదరదని..34 కిలోల బియ్యమే వస్తుందని తెలిపారు.30 కిలోల తేడాను భరించేందుకు కేంద్రం ఒప్పుకోవట్లేదన్నసీఎం..కేంద్ర ప్రభుత్వం ఆహర భద్రత బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. వ్యవసాయాన్నినిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ధాన్యం కొనమంటే నూకలు తినండని కేంద్రమంత్రి మాట్లాడుతున్నారని..పీయూష్ గోయల్ కు బుద్ధి ఉందా? అని ప్రశ్నించారు సీఎం. తెలంగాణ సాధించిన ఘనత కేంద్రానికి చేతకాక.. కుట్రలకు పాల్పడుతోందని..ఏ రాష్ట్రంలో పండించనంత పంటను పండించామని తెలిపారు.ధాన్యం కొనలేమని..తాము దద్దమ్మలమని కేంద్రం చెప్పొచ్చు కదా? అంటూ చురకలంటించారు.కేంద్రం చెప్పుచేతల్లో రాష్ట్రాలు ఉండాలనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీగా కనిపిస్తోందని మండిపడ్డారు. బ్యాంకుల్లో లక్షల కోట్లు కొల్లగొట్టిన దొంగలను వదిలేస్తారు. విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకోవటానికి మన అధికారులు వెళితే..వెనక్కి రమ్మని కాల్ చేస్తారు. అదానీ లాంటి వారికి అండగా ఉంటారు కానీ..అన్నదాత అంటే కేంద్రానికి పట్టదా అంటూ వాగ్బాణాలు సంధించారు కేసీఆర్. అసలు పాలించటానికి చేతగానీ, చేవలేని తెలివిలేని ప్రభుత్వం కేంద్రంలో ఉందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక సరికొత్త నేషనల్ పాలసీ ఉండాలనీ, అందుకోసం తాను కూడా ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నాననీ చెప్పారు.
ఢిల్లీలో ఉన్న వారంలో తనను అనేకమంది మేధావులు కలిసి వివిధ విషయాలపై చర్చలు జరిపారని చెప్పారు కేసీఆర్. మహా అయితే మరో మూడు నాలుగు వేల కోట్లు ..తన తెలంగాణ రైతులను ఆదుకోవటానికి ఖర్చు పెట్టడానికి వెనకాడమనీ..కేంద్రానికి చేతగాకుంటే తాము చూస్తు ఊరుకోబోమని చెప్పుకొచ్చారు.
30-35 శాతం నూకల వల్ల వచ్చే నష్టాన్నిభరించడానికి ఇంత రచ్చ చేస్తారా?ఒక చిన్నరాష్ట్రం పండించిన ధాన్యాన్నికొనడానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవా?అని ప్రశ్నించారు.రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు గానీ..కార్పొరేట్లకు మాత్రం దోచిపెడుతున్నారంటూ ఆరోపించారు.
Advertisements
తెలంగాణ రైతులు పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు.
కొనుగోళ్ల కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశామన్న కేసీఆర్.. 3-4 రోజుల్లోనే ధాన్యాన్ని కొంటామన్నారు. కనీస మద్దతు ధర రూ.1960కే కొనుగోళ్లు జరుగుతాయని.. ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండని రైతులను విజ్ఙప్తి చేశారు. దిక్కుమాలిన కేంద్రం హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన తాము చూస్తూ ఊరుకోమని అన్నారు కేసీఆర్.