సీఎం కేసీఆర్ బీజేపీకి జీ హుజూర్ అంటున్నారా…? ఢిల్లీ పెద్దలతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఢిల్లీపై కేసీఆర్ నోరు మెదపటం లేదా…? ఇప్పటి వరకు జరిగిన యూటర్న్ లకు తోడు ఇక నుండి సంపూర్ణ మద్దతు పర్వం మొదలైపోతుందా…?
ఇప్పుడు ఈ ప్రశ్నలు ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీలో చర్చనీయాంశంగా మారిపోయాయి. మొన్నటి వరకు మీ నిర్ణయాలన్నీ పనికొచ్చేవి కావంటు మండిపడి, ఆ తర్వాత యూటర్న్ తీసుకోగా… ఇప్పుడు కొత్తగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను కనీసం విమర్శించటానికి కూడా ముందుకు రావటం లేదు.
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్నికలున్న రాష్ట్రాలకే నిధులు భారీగా వెళ్లాయి. పక్కనున్న బెంగళూరు, చెన్నై మెట్రోలకు నిధుల వరద పారింది. కానీ హైదరాబాద్ మెట్రో పేరే లేదు. తెలంగాణ పదం కూడా బడ్జెట్ లో వినిపించలేదు. ఇలాంటి సమయంలో కేంద్రాన్ని, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని తూర్పరబట్టే కేసీఆర్ భయటకు రాలేదు. సరే… ఫాంహౌజ్ లో ఉన్నారు, బడ్జెట్ పై రివ్యూ తర్వాత స్పందిస్తారనుకున్నారు. కానీ అదీ లేదు. సుదీర్ఘంగా కేంద్రం నుండి వచ్చిన కేటాయింపులు, రాష్ట్ర బడ్జెట్ ముఖచిత్రంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కానీ కనీసం బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై మాట మాత్రం కూడా విమర్శిస్తూ పత్రికా ప్రకటన కూడా రాలేదు.
దీంతో కేసీఆర్ బీజేపీకి జీ హుజూర్ అంటున్నారని, ఢిల్లీ దోస్తానీ చేస్తూ గల్లీలో ప్రజల్లో చులకన కాకుండా ఉండేందుకు విమర్శల నాటకానికి తెరతీస్తున్నారన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలే నిజమవుతున్నాయన్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.