నేను అసలైన హిందువును… మీ బొందుగాళ్లు రాజకీయాలే చేస్తారు… అని ఫైర్ అయ్యింది కేసీఆరే. నీ ఆయుష్మాన్ భారత్ ఎవడికి కావాలి… మా ఆరోగ్య శ్రీ ఉండగా అన్నది సీఎం కేసీఆర్. మేం తెలంగాణలో ఒప్పుకోం అంటూ తెగేసి చెప్పింది కేసీఆరే. కానీ ఎందుకు యూటర్న్ తీసుకున్నట్లు…? కారణం తెలియాలంటే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాల్సిందే.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో ఓటమితో సీఎం కేసీఆర్ కు… క్షణాల్లో మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రతిసారి ఇతర నేతలతో కలిసి మీటింగ్స్ లో పాల్గొనే కేసీఆర్ ఈసారి ఏకాంత చర్చలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఏమైందో ఏమో కానీ అనూహ్యాంగా కేసీఆర్ యూటర్న్ నిర్ణయాలు మొదలయ్యాయి.
రైతుల కొత్త చట్టాలను వ్యతిరేకించిన కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. కొత్త చట్టాలను అమలు చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలెవరూ బీజేపీపై మాట కూడా అనటం లేదు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పై కూడా యూటర్న్.
ఈ యూటర్న్ ల వెనుక అసలు కారణం కేసులేనంటున్నారు విశ్లేషకులు. సీఎం కేసీఆర్ పీక మీద సహారా కేసు వేలాడుతుంది. ఇప్పటికే సీబీఐ కేసీఆర్ ను ప్రగతి భవన్ లో ప్రశ్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు అరెస్ట్ తప్పదంటూ హెచ్చరికలు చేశారు. కేవలం రాజకీయ ఆరోపణలకు పరిమితం కాకుండా… కేసీఆర్ ను విమర్శించే ప్రతిసారి జైలు కూడు తినిపిస్తాం అంటూ హెచ్చరించారు. కానీ కేసీఆర్ ఢిల్లీ పర్యటనల తర్వాత ఈ హెచ్చరికల వాడీవేడి తగ్గింది. ఇవన్నీ గమనిస్తే తెలంగాణ సర్కార్ లో అవినీతి, అంతకుముందు ఉన్న సహారా వంటి కేసులే కారణమని… కేసీఆర్ బీజేపీ అగ్రనాయత్వానికి సరెండర్ అయ్యారని విశ్లేషిస్తున్నారు.
రాబోయే రోజుల్లోనూ కేంద్రం నిర్ణయాలకు కేసీఆర్ సపోర్ట్ ఉంటుందని… ఇక టీఆర్ఎస్ బీజేపీకి బీ టీంగా పనిచేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ లేదంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కు అవకాశం ఉండకూడదన్న ఎత్తులు కూడా కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.