సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా…? ఎంతో కాలంగా ఆలోచిస్తున్న ఆ అంశంపై కేసీఆర్ ఫైనల్ నిర్ణయం తీసుకున్నారా…? ఈ నిర్ణయంతో తెలంగాణ బడ్జెట్ బండిపై భారం తగ్గనుందా…?
సీఎం కేసీఆర్ తెలంగాణ ఖజానా ఖాళీపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా… కొత్త సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్న ఆర్థిక శాఖపై ఉన్న తీవ్ర భారాన్ని తగ్గించాల్సిందే. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల పనులు చాలా చోట్ల నిలిచిపోయాయి. బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. రోడ్ల పరిస్థితీ అంతే. రోడ్లు-భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల్లో వందల కోట్ల చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.
మరోవైపు సీఎం కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హమీ నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇక రెండో విడత రైతుబంధు టైం వచ్చేసింది. పైగా 57ఏళ్లకే పెన్షన్ చెల్లించాల్సి ఉంది. ఇలా కొత్త హమీలతో పాటు పాత హమీలు, బకాయిలు చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ వద్ద పైసల్లేవు. ఆర్థిక శాఖ కొత్త ప్రాజెక్టులు ఏవీ టెకప్ చేయటం లేదు. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకు అనుమతులివ్వటం లేదు.
దీంతో… ఖజానా నింపేందుకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న నిర్ణయంపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2013 తర్వాత భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచలేదు. దీంతో… భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో… సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు ప్రగతిభవన్ వర్గాల సమాచారం. అయితే, మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున ఎన్నికల ముందు పెంచాలా…? ఎన్నికలు ఆలస్యం అయితే ముందే పెంచేయాలా అనే అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటే ముందుగానే పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా… కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, రియల్ రంగంపై ఇంకా ఆర్థిక మాంద్యం పడనందున ఈ నిర్ణయంతో భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా రాజధానితో పాటు రాజధాని చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల్లో మంచి ఆదాయం వస్తుందని… ప్రభుత్వం లెక్కలు కడుతోంది.