దేశ భవిష్యత్‌ను మార్చే సంకల్పంతోనే బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్బవించామని సీఎం కేసీఆర్ అన్నారు. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నమని ఆయన అన్నారు. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ ను నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. నవ నిర్మాణ్ కృషక్ సంఘటన్ కన్వీనర్ అక్షయ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు. దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్ ఒకరని పేర్కొన్నారు.
రైతుల తరపున గమాంగ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. గమాంగ్ రాజకీయ జీవితం మచ్చలేనిదని తెలిపారు. గమాంగ్ చేరిక తనకు వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే మన దేశంలో వనరులు ఎక్కువ ఉన్నాయన్నారు.
అన్ని వనరులు ఉన్నప్పటికీ దేశం అభివృద్ధి చెందడం లేదన్నారు. భారత్ తన లక్ష్యాన్ని మరిచిందని ఆయన వెల్లడించారు. అమెరికా వెళ్లేందుకు దేశ యువత తహతహలాడుతోందన్నారు. అమెరికా గ్రీన్ కార్డు వస్తే సంబురాలు చేసుకుంటున్నారన్నారు.
దేశంలో సరిపడా నీళ్లున్నాయనీ కానీ అవి పొలాలకు మళ్లవన్నారు. సరిపడా విద్యుత్ ఉన్నప్పటికీ చీకట్లు తొలగవన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయని కానీ రైతులు, కార్మికుల పరిస్థితి మారలేదన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల్లో గెలవడమే నేటి నాయకులకు లక్ష్యంగా మారిందన్నారు. ఏదో విధంగా ఓట్లు సంపాదించుకోవడమే రివాజుగా మారిందన్నారు. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్నా నేటికి తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదన్నారు. ఈ 75 ఏండ్లలో మనం ఏం సాధించినట్టు? అని ఆయన ప్రశ్నించారు.
జాతి, ధర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారు? అని అన్నారు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు అంతేకానీ తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వరంటూ మండిపడ్డారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు 13 నెలల ఉద్యమం ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికీ రైతులకు ఒక భరోసాను కేంద్రం ఇవ్వలేకపోయిందన్నారు. అందుకే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని బీఆర్ఎస్ ఎత్తుకున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించండని ఆయన కోరారు. దేశంలో నీళ్లు, కరెంట్ ఎందుకు రావో తాను చూస్తానన్నారు.
మనసు పెట్టి పని చేస్తే ఏదైనా సాధ్యమేనన్నారు అందుకు తెలంగాణే సాక్ష్యమన్నారు. తెలంగాణలో సాధ్యమైంది దేశమంతటా ఎందుకు సాధ్యం కాదన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి తాగునీటిని ఇస్తున్నామన్నారు. దేశమంతా ఎందుకు ఇవ్వలేమని ప్రశ్నించారు.