సీఎం కేసీఆర్ సభలో ప్రసంగిస్తున్నారంటే.. అందులో ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రతిపక్ష నేతలు కూడా ఆయన చెప్పే సామెతలు, పిట్ట కథల కోసం ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదనే చెప్పుకొవచ్చు. అలా ఆకట్టుకోవడం కేసీఆర్ కు మాత్రమే సొంతం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో కూడా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో కేసీఆర్ మొదటి నుంచి కూడా మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఐ, ఎన్డీఏ ప్రభుత్వాలను పోల్చుతూ.. ప్రసంగాన్ని సాగించారు. అయితే ప్రధాని మోడీ కంటే.. మన్మోహన్ సింగ్ ఎక్కువ పని చేశారంటూ కితాబిచ్చారు కేసీఆర్.
అందుకు తగిన ఆధారాలు కూడా వివరించారు. అయితే.. మోడీ హయాంలో మాత్రం ఒక్కటంటే ఒక్క సెక్టార్‌లోనూ వృద్ధి లేదంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. దేశంలో అన్ని పరిశ్రమలు మూత పడుతున్నా.. రూపాయి పతనమవుతున్నా.. తామే గొప్ప అంటూ జబ్బలు చరుచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రధాని మోడీని తన చుట్టూ ఉన్నవాళ్లు పొగడటంపై సీఎం కేసీఆర్ తనదైన స్టైల్‌లో ఓ ఆసక్తికరమైన కథ చెప్పారు.
అనగనగా ఓ రాజ్యం. ఆ రాజ్యానికి ఓ రాజు. ఆ రాజు పేరు తిరుమల రాయుడు. అయితే.. ఆ రాజుకు ఒకటే కన్ను ఉంటుంది. ఈ విషయంలో ఆ రాజుకు కొంత బాధ ఉంటుంది. అయితే.. అదే రాజ్యంలో ఓ కవి ఉంటాడు. ఆ కవికి ఓ రోజు ఓ బాధ వచ్చిపడింది. ఆ రాజు దగ్గర మెప్పు పొందాలి. ఎలా పొందాలని ఆలోచిస్తుంటే.. తన స్నేహితుడు ఓ సలహా ఇస్తాడు. రాజును గొప్పగా పెడిగితే.. రాజు సంతోషపడి నీకు బహుమానాలిస్తాడు అని చెప్తాడు. దానికి ఆ కవి… రాజుకు ఒకటే కన్ను ఉంది ఎలా పొగడాలంటాడు. అయినా సరే నువ్వు పొగడాల్సిందే అని చెప్పటంతో.. ఇక చేసేదేమీ లేక.. తన సాహిత్య చతురతతో రాజును పొగుడుతాడు ఆ కవి. మనసులో ఇష్టం లేకపోయిన పొగటటం ప్రారంభిస్తాడు.
అన్నాతిగూడి హరుడవు..
అన్నాతిని కూడనప్పుడు అసురగురుండవు..
అన్నా తిరుమలరాయా కన్నొక్కటె లేదు గానీ కౌరవ పతివే”
నువ్వు భార్యతో ఉన్నప్పుడు.. నీది ఒకటి, ఆమె రెండు కళ్లతో కలిసి మూడవుతాయి.. అంటే శివునిలా మూడుకళ్లున్నట్టే. అయితే.. భార్యతో లేనప్పుడు నీకున్న ఒక్క కన్నుతోనే రాక్షసుల గురువైన శుక్రాచార్యునంతటివాడివి. (రాక్షసుల గురువైన శుక్రాచార్యునికి కూడా ఒంటి కన్ను ఉంటుంది.) ఇక.. ఆ ఉన్న ఒక్క కన్ను కూడా పోయినా బాధపడేది లేదు. అది కూడా పోతే కౌరవుల పెద్ద దిక్కయిన ద్రుతరాష్టుడంతటివాడివంటూ.. పొగడ్తాడు. అంటూ కేసీఆర్ తనదైన స్టైల్‌లో సభలో స్టోరీ చెప్పారు.
అయితే.. ఈ స్టోరీలో చెప్పినట్టే.. మోడీ చుట్టు ఉన్న వాళ్లు కూడా నువ్వే గొప్ప నువ్వే గొప్ప అంటూ పొగడ్తలతో ఆయనను మోసం చేస్తున్నారు. దేశానికి మంచి చేద్దామని చెప్పకుండా.. ఏమీ చెయ్యకపోయినా గొప్ప అంటూ చెప్తూనే ఉన్నారు. ఇలా ఎప్పటివరకు చెప్తారంటే.. ఆయన మాజీ ప్రధాని అయ్యేవరకు ఇలాగే చెప్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దీంతో.. సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది.