బీజేపీ, కాంగ్రెస్ కు ధీటుగా మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని కేసీఆర్ తెగ తాపత్రయపడుతున్నారు. దీనికోసం దసరా నాడు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు ప్రగతి భవన్ లో కీలక భేటీ నిర్వహించారు. మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఈ సమావేశం కొనసాగింది. దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత స్పందించారు. దసరా రోజు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
ఈనెల 5న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని సత్యవతి రాథోడ్ చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం కోసం తీర్మానం చేస్తారని అన్నారు. కొత్త పార్టీకి కూడా గులాబీ జెండా, కారు గుర్తే ఉంటుందని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని మంత్రి చెప్పారు.
జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారని వివరించారు. ఇప్పటికే చాలా మంది నాయకులు చిన్న పార్టీలను విలీనం చేస్తామని వస్తున్నారని అన్నారు. 5న కొంతమంది జాతీయ నేతలు కూడా తమ సమావేశానికి వస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులు, యువతీ యువకులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏ రాష్ట్రంలో లేనన్నీ సంక్షేమ పథకాలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పారు.
ఇక కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 6న ఢిల్లీకి ప్రతినిధుల బృందం వెళ్ళనుంది. పార్టీ పేరు గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గోప్యత పాటిస్తున్నారు. పార్టీ మార్పు, జాతీయ పార్టీగా విస్తరించడానికి సంబంధించి శాసనసభా పక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించేలా కసరత్తు జరుగుతోంది. జాతీయ పార్టీ పేరుపై చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తూ ఉత్కంఠను పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించవచ్చనేది కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో అవసరమైన విస్తృత పర్యటనల కోసం వంద కోట్లతో 12 సీట్ల సామర్ధ్యం కలిగిన ప్రత్యేక విమానం కొనుగోలు చేయాలని ఇప్పటికే టీఆర్‌ఎస్ నిర్ణయించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా.. కేసీఆర్ మాత్రం విమానం కోసం విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు.