– వరంగల్ కు కేసీఆర్
– ఆదివారం వరదలపై ఏరియల్ సర్వే
– కడెం నుంచి భధ్రాచలం వరకు పరిశీలించనున్న సీఎం
వారం రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఉత్తర తెలంగాన అతలాకుతలం అయింది. రెండు రోజులుగా వర్షాలు తగ్గినా వరద పోటుతో గోదావరి తీర ప్రాంతాలు అల్లాడుతున్నాయి. అలాగే ఇతర జిల్లాల్లోనూ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నీళ్లలో నానుతోంది. అయితే.. ఇంత జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వీడడం లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి.
ఓవైపు జనం చస్తున్నా కేసీఆర్ సమీక్షలతో కాలం గడిపేస్తున్నారని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సీఎం ప్రగతి భవన్ నుంచి బయటకొచ్చారు. ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో వరంగల్ కు వెళ్లారు. ఆదివారం జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. రాత్రికి టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస ఏర్పాట్లు జరిగాయి.
ఆదివారం ఉదయం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితిని కేసీఆర్ పరిశీలించనున్నారు. కేసీఆర్ ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనుంది. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో జూన్ నుంచి జులై 12 వరకు ఏకంగా వందశాతానికి మించి అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో సాధారణంకన్నా 95, హనుమకొండ జిల్లాలో 88 శాతం అధిక వర్షపాతం కురిసింది. ప్రాణహితతో కలసి గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో పుష్కరఘాట్లు, దుకాణాలు మునిగిపోయాయి. ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ఏజెన్సీ గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. పెంకవాగు ఉధృతితో వెంకటాపురం మండలంలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తిప్పాపురం, కొతగుంపు, పెంకవాగు, కలిపాక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో… ట్రాక్టర్లు, పడవల ద్వారా అధికారులు నిత్యావసర సరకులను తరలించారు.
Advertisements
వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జనం విలవిలలాడుతున్నారు. గోదావరి ఉగ్రరూపంతో మహాదేవపూర్, పలిమేల, కాటారం మండలంలో పరిస్థితి భీభత్సంగా మారింది. ఆయా మండలాల్లో లోతట్టు గ్రామాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. సామగ్రి చేతబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.