తెలంగాణలో ఆటోలు, ప్రభుత్వ ప్రజా రవాణ వ్యవస్థ ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందా…? అంటే అవుననే తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భౌతిక దూరం చర్యలు పాటిస్తూ దశల వారీగా ప్రజా రవాణాను మొదలుపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూనే… ఆర్టీసీని మొదలుపెట్టే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులు డిపోల మేనేజర్లు, వైద్య నిపుణులతో చర్చించారు. సీఎం రివ్యూ సమావేశానికి ముందు ఈ సమాలోచనలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఆటో డ్రైవర్లు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. కానీ అందర్నీ రోడ్డుపైకి అనుమతిస్తే పరిస్థితి ఏంటీ అన్న అనుమానంతో ఉంది సర్కార్.
గ్రీన్ జోన్లలో ఆటోలకు అనుమతిస్తూ, గ్రీన్-ఆరెంజ్ జోన్లలో బస్సులను పరిమిత సంఖ్యలో తిప్పితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో సర్కార్ ఉంది. గతంలో 52 రోజుల సమ్మె, ఇప్పుడు 50 రోజుల లాక్ డౌన్ తర్వాత ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి కూరుకపోయింది. దీంతో క్రమంగా బస్సులను తప్పక తప్పదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.