ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ పార్టీ ఆఫీసు శంకుస్థాపనతో పాటు ప్రధాని మోడీ, పలువురు మంత్రులను కలిశారు. నిజానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తర్వాతే మంత్రుల అపాయింట్మెంట్ కోరి కలిశారు. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోయినా వారు ఢిల్లీ వచ్చే వరకు వెయిట్ చేసి మరీ కలిశారు. సోమవారం రాత్రి వరకు మంత్రులతో భేటీ పూర్తికావటంతో ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారని అంతా భావించారు.
కానీ సీఎం ఢిల్లీలోనే ఆరోగ్య పరీక్ష పరీక్షలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీలోనే కంటి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్… మరోసారి కంటి పరీక్షలు చేయించుకోబోతున్నారు. ఆయన దంత సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాంటున్నాయి. దీంతో అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరమే ఆయన హైదరాబాద్ రిటర్న్ అవుతారని తెలుస్తోంది. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. అయినా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో కేసీఆర్ ఢిల్లీ నుండి కూడా వర్షాలపై ఆరా తీయలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.