శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే, వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ, రవాణాపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా ఒకేలా లేదని, పైగా ఒక్కో చోట ఒక్కో రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని… మొదట కొంతమందికి డొసులు ఇచ్చి, ఓ పదిహేను రోజుల గ్యాప్ తర్వాత సేఫ్ అనుకుంటే ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే కేసీఆర్ అధికారులతో సమావేశం అయ్యారు. వ్యాక్సిన్ వేసేందుకు రోడ్ మ్యాప్ రెడీ చేయాలని, అందుకు అవసరమైన కోల్డ్ చైన్ సిస్టమ్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్ ను గ్రామీణ స్థాయిలో అందించేలా ఏర్పట్లు ఉండాలని, రిమోట్ ఏరియాలను కూడా కవర్ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ… మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు.