- సీఎం కేసీఆర్ సతీమణికి అస్వస్థత
- యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సతీమణి శోభ గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో నొప్పి ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. అయితే వివిధ వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు ఆమోదం తెలపడంతో యశోద వైద్య బృందం మోకాలి ఆపరేషన్ నిర్వహించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కాగా ప్రస్తుతం శోభకు విశ్రాంతి అవసరమని, కొద్దిరోజుల బెడ్ రెస్ట్ అనంతరం యధావిధిగా ఆమె నడవవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. శోభ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు, నేతలు సైతం పరామర్శించారు.
నాలుగు నెలల కింద సీఎం కేసీఆర్ సైతం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు ఇదే హాస్పిటల్‌లో చేర్పించారు. యశోద ఆస్పత్రి డాక్టర్లు సీఎంకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజు అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.