అవసరం లేకపోయినా సెక్రటేరియట్ కూల్చేసి.. మొండిగా కొత్తది నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పనులైతే చురుగ్గా జరుగుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ నిర్మాణ పనుల్ని పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త సచివాలయం ఏడేళ్ల ఆదర్శవంతమైన, స్వపరిపాలనకు అద్దం పట్టాలని అన్నారు. గౌరవం ఉట్టిపడేలా ఉండాలని చెప్పారు. నిజానికి ఈ మాటలు హాస్యాస్పదంగా అనిపించొచ్చు. ఎందుకంటే ఏడేళ్ల కేసీఆర్ పాలన ఆదర్శవంతం అంటే నవ్వు రాకుండా ఉంటుందా..? ఇన్నేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందా..? అని పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి ప్రతిపక్షాలు.
మీకు ట్రిబుల్ ఎక్స్ సోప్ యాడ్ గుర్తుండే ఉంటుంది. తమ సబ్బు సంస్కారవంతమైందని ఆ ప్రకటనలో ఉంటుంది. అయితే సబ్బుకు సంస్కారం ఉండదు.. మనిషికే ఉంటుంది. కేసీఆర్ చెబుతున్న మాటలు కూడా అలాగే ఉన్నాయని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఓ భవనం ఆదర్శవంతమైన, స్వపరిపాలన అందిస్తుందా..? పాలకుడే అందించాలి. మరి.. ఏనాడూ సచివాలయానికి వెళ్లని కేసీఆర్… ఆదర్శవంతమైన పాలన గురించి మాట్లాడడం హాస్యాస్పదం కాదా..? అని సెటైర్లు వేస్తున్నాయి.
పైగా.. ప్రజలను కలవరు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వరు. అలాంటి కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారా..? ఇలా చెప్పుకోడానికి సిగ్గులేదా..? అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. కోవర్టు ఆపరేషన్లతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఆదర్శవంతమైన పాలన ఎలా అవుతుంది..? ప్రతిపక్షాలను బలహీనపరచడం మంచి పాలన అంటారా..? దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేశారు.. మూడు ఎకరాల భూమి ఇస్తానని మాయ చేశారు.. ఉద్యమకారులను పక్కకు నెట్టి ద్రోహులను అందలం ఎక్కించారు.. ఇదేనా కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన అని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.
ఇలా.. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయడం.. ఎన్నికలు వస్తే చాలు అర్థం లేని హామీలన్నీ గుమ్మరించడం.. వాటి గురించి ప్రశ్నించిన జర్నలిస్టులను జైల్లో పెట్టడం.. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం.. ఇదేగా ఏడేళ్ల నుంచి కేసీఆర్ చేస్తోంది.. ఇందులో ఆదర్శవంతమైన పాలన ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. కొత్త సచివాలయం ఆదర్శవంతమైన పాలనను, స్వయం పరిపాలనను అందిస్తుందని చెప్పడం.. చూస్తుంటే ఆయన చిప్ కరాబ్ అయిందా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి.