క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు,భారీ వర్షాలు సంభవించాయా..? సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం చాలా శోచనీయం. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. క్లౌడ్ బరస్ట్ వల్లే వరదలు వచ్చాయనడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.
అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనేది సిల్లీగా ఉంది. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరి కాదని ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడంతో.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి చిన్న ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతాయని ఆయన వెల్లడించారు.
సీఎం కేసీఆర్ మత్తు వీడి నిద్ర నుంచి బయటకు వచ్చారని.. వరద ప్రభావిత ప్రాంతాలు చూడడానికి వెళ్లారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వెళ్తున్నారని తెలిశాక పరువు పోతుందనే సీఎం వెళ్లారని ధ్వజమెత్తారు. ఓ వైపు గవర్నర్.. మరోవైపు సీఎం వెళ్లారని చెప్పారు.
కాళేశ్వరం మానవ తప్పిదం కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోనే పెద్ద ఇంజినీర్ అని చెప్పుకునే కేసీఆర్ మాట్లాడడానికి ఎందుకు జంకుతున్నారని పొన్నాల నిలదీశారు. కాళేశ్వరం లోపభూయిష్టమైన ప్రాజెక్టు అని ఆరోపించారు. కాళేశ్వరం వద్ద 12లక్షల క్యూసెక్కుల నీరు ఉన్నప్పుడే పంప్‌హౌస్‌లు మునుగుతాయా? అని ఆక్షేపించారు.
ఎల్లంపల్లి నుంచి వచ్చి అతి ఎక్కువ వరదనీటిని పోచమ్మసాగర్‌కు తీసుకురావచ్చని చెప్పారు. కాళేశ్వరం ద్వారా 35లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పుకుంటున్నారని.. ఇక ఎకరాకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో లక్షల కోట్లు ఎలా ఖర్చుపెట్టారని నిలదీశారు. ఈ విషయంలో చర్చకు రావాలని పొన్నాల డిమాండ్ చేశారు.