మాజీ ముఖ్య మంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన రేపు యూపీకి వెళ్లనున్నారు. అక్కడ ములాయం పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ములాయం సింగ్ గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను రేపు ఆయన స్వగ్రామమైన సాయ్ పాల్ లో నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకు ముందు ములాయం సింగ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత పెద్దదైన రాష్ట్రానికి ములాయం మూడు సార్లు సీఎంగా పని చేశారని అన్నారు. ములాయం తన జీవిత కాలంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పని చేశారని పేర్కొన్నారు.
ములాయ సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ములాయం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాం మనోహర్ లోహియా వంటి మహానేతల స్పూర్తితో ములాయం రాజకీయాల్లోకి అడుగు పెట్టారని ఆయన గుర్తు చేశారు.