సీఎం కేసీఆర్ అడుగులు ఎటువైపు…? ఓవైపు సీఎం మార్పు ప్రచారం… మరోవైపు బీజేపీతో దోస్తానా అంటూ ఊహాగానాలు? ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం క్లారిటీ ఇవ్వబోతున్నారు.
కేటీఆర్ ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులు బలంగా కోరుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటున్నారు. ఈటెలను డిప్యూటీ సీఎం చేస్తారని, హారీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని, త్వరలో కేంద్రమంత్రివర్గంలో కేసీఆర్ ను చూడబోతున్నామని ఇలా ఎన్నో ప్రచారాలు. ఇక కేటీఆర్ ఎందుకు సీఎం కావటం… ఉద్యమ నాయకుడు ఈటెలను చేయవచ్చు కదా అంటూ ప్రతిపక్షాల కౌంటర్ అటాక్.
కొంతకాలంగా ఈ ఊహాగానాల వల్ల స్థబ్దుగా ఉన్న పార్టీకి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆదివారం మద్యాహ్నాం రాష్ట్ర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై చర్చిస్తారని ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర కమిటీ సమావేశానికి ఇంతమందికి ఆహ్వానం అంటేనే కీలకమైన సందేశం ఇవ్వబోతున్నారని… అది సీఎం మార్పు అంశమా…? హరీష్ రావును వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా..? కవితకు పార్టీ పదవులు ఇస్తారా…? అన్నీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.