తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరబాదరగా క్వాలిటీ లేకుండా పనులు నిర్వహిస్తుండడం వల్లే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుందన్నారు.
తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణమని ఆయన అన్నారు.ఫిబ్రవరి 17న కొత్త సచివాలయం ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని బండి డిమాండ్ చేశారు.
ఫైర్ సేఫ్టీ సహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం 5,6 అంతస్తుల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో సచివాలయ గుమ్మటంపై పొగలు కమ్ముకున్నాయి. 11 ఫైరింజన్లతో సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు సచివాలయంలో జరిగింది ప్రమాదం కాదని మాక్ డ్రిల్ అని భద్రతా సిబ్బంది చెబుతున్నారు.