ఈ నెల 18న ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో చర్చించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లా నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు కేసీఆర్. అయితే.. ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామానాగేశ్వరరావుతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కొత్తగూడెం, పాలేరు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందా ఉపేందర్ డుమ్మా కొట్టారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడతారన్న ప్రచారం సాగుతోంది. కొంతకాలంగా ఆయన అసంతృప్త వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ సభ రోజే అమిత్ షాతో భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ మీటింగ్ కు వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈనెల 12న మహబూబాబాద్, అదేరోజు మధ్యాహ్నం భద్రాద్రి కలెక్టరేట్లను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే 18న ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు జనాన్ని భారీగా సమీకరించాలని పార్టీ నేతలకు ఇప్పటికే పిలుపు వెళ్లింది. కొందరు జాతీయ నేతలకు కూడా ఆహ్వానం పంపారు కేసీఆర్.