పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. తాజాగా ఆమె ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ కు ఈ నెల 26న అక్షరాభ్యాసం చేయించనున్నారు. గవర్నర్ కు అక్షరాభ్యాసం ఏంటీ.. సీఎం చేయించడం ఏంటీ.. అని అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే.
ఈ నెల 26న సరస్వతీ పూజను పురష్కరించుకొని మమతా బెనర్జీ సమక్షంలో రాజ్ భవన్ లో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పలక,బలపం పట్టి గవర్నర్ బెంగాలీ అక్షరాలు దిద్దుతారు. రాజ్ భవన్ లో ఆనంద్ బోస్ కు ఈ క్రతువు జరగనుంది. ఆంగ్లం,హిందీ,మలయాళం భాషల్లో దాదాపు 40 పుస్తకాలు రాసిన ఆనందబోస్ బెంగాలీలోనూ ఓ పుస్తకం రాయాలని ఆసక్తితో ఉన్నారు. బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన తన ఆసక్తిని వెలిబుచ్చారు.
ఇందుకోసం బెంగాలీ భాష నేర్చుకోవాలని నిర్ణయించారు. బెంగాలీ భాషలోని అక్షరాలను నేర్చుకునే ముందు భాగంగా చిన్నారులకు హతేఖోరీ పేరుతో నిర్వహించే సంప్రదాయం రీతిలో అక్షరాభ్యాస తంతును గవర్నర్ కు నిర్వహిస్తారు. ఇదిలా..ఉండగా మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద్ బోస్ మలయాళీ.. కాగా ఆయన ఎన్నో భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.
ఆయన తండ్రి వాసుదేవన్ నాయర్ కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే ఎనలేని గౌరవం. అందుకే తన పిల్లలందరి పేర్లకూ చివర బోస్ అనే పేరు పెట్టారు.