పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీఎం మమతా బెనర్జీ దూకుడు పెంచారు. పార్టీ ఫిరాయించిన సువెందు అధికారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆయిన పోటీ చేసి గెలిచిన నందిగ్రామ్ నియోజకవర్గం నుండి తాను పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. నందిగ్రామ్ లో పర్యటించిన మమత… ఈ మేరకు ప్రకటన చేశారు.
నందిగ్రామ్ నాకు కలిసొచ్చిన ప్రాంతం… ప్రతి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇక్కడ నుండే ప్రారంభించేదాన్ని… ఈసారి ఇక్కడి నుండే ఎన్నికల బరిలో ఉంటానంటూ ప్రకటించారు. వీలైతే భవానీపుర్ నుంచీ బరిలో ఉంటానని తెలిపారు. ఇక పార్టీని వీడిన వారి గురించి మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడిన వారికి అభినందనలు. వారు భవిష్యత్తులో రాష్ట్రపతి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి…. కానీ బెంగాల్ ను బీజేపీకి అమ్మాలనే దుస్సాహసం మాత్రం చేయకండి. నేను ప్రాణాలతో ఉన్నంతవరకు ఆ పని జరగనివ్వను అంటూ ప్రకటించారు. ఇక్కడ ఉద్యమం కారణంగానే బెంగాల్ లో కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయి టీఎంసీ గెలిచి వచ్చింది.
నందిగ్రామ్ లో టీఎంసీ కీలక నేతగా ఉన్న సువెందు అధికారి తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి… బీజేపీలో చేరారు. ఈ ఏడాది మే లేదా ఏప్రిల్ నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.