రాష్ట్రంలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు పంపాల్సిందేనన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలపై మమతా బెనర్జీ సీరియస్ రియాక్టయ్యారు. ఈ విషయంపై సుప్రీంలోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటనలో ఆయన కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ సమయంలో ఈ ముగ్గురు అధికారులు నడ్డా బందోబస్తులో పాల్గొన్నారు. నడ్డా పర్యటన సందర్భంగా ఆయనకు తగిన భద్రత కల్పించడంలో విఫలం చెందారని, వెంటనే కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై పంపాలని కేంద్ర హోంశాఖ కోరింది. తప్పు జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, కేంద్ర సర్వీసులకు పంపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని బెంగాల్ ప్రభుత్వం లేఖ రాయటంతో వివాదం ముదిరిపోయింది. కానీ కేంద్రం మాత్రం డైమండ్ హార్బర్ ఎస్పీ భోలనాథ్ పాండే, డిఐజీ ప్రవీణ్ త్రిపాఠీ, ఏడీజీ రాజీవ్ మిశ్రాలను వెంటనే కేంద్ర సర్వీసులకు పంపాల్సిందేనని ఆదేశించటంతో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లనుంది.