అన్నాడీఎంకేలో పోలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన పోరు ఇంకా చల్లారటం లేదు. జయలలిత అంతరంగికురాలు శశికళ అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపి రావటంతో… పార్టీలో పోరు మళ్లీ మొదటికొచ్చింది.
కర్ణాటక నుండి చెన్నై రానున్న శశికళ… నేరుగా జయ సమాధి వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. జైలుకు వెళ్లే ముందు కూడా శశికళ జయ సమాధిపై శపథం చేసింది. పైగా పార్టీ ఎన్నికల గుర్తైన రెండాకులు తమకే కేటాయించాలని, పార్టీ తమదేనంటూ శశికళ వర్గం సుప్రీంను ఆశ్రయించింది.
దీంతో శశికళకు చెక్ పెట్టేందుకు సీఎం పళనిస్వామి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 15రోజుల పాటు జయ సమాధి సందర్శనపై నిషేధం విధించింది. అక్కడ పలు అభివృద్ధి పనులు మిగిలిపోయాయని, అవి పూర్తి చేసేందుకు సందర్శకులను ఎవర్నీ అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఇది శశికళకు చెక్ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయమేనన్నది తమిళ రాజకీయాల్లో బహిరంగ రహస్యమే.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున తమిళనాడులో రాజకీయ వేడి ఇప్పటికే మొదలైపోయింది.