హైదరాబాద్ : ఓపక్క దేవులపల్లి అమర్ నియామక వివాదం ఇంకా చల్లారకముందే ఢిల్లీ ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా సాక్షి కుటుంబం నుంచి వచ్చిన మరో జర్నలిస్ట్ అరవింద్ యాదవ్‌ను నియమిస్తున్నట్టు వెలువడిన ఉత్తర్వులు మరింత మంటను పుట్టిస్తున్నాయి. అమర్ నియామకాన్ని రద్దు చేయాలంటూ విజయవాడ కేంద్రంగా కొందరు జర్నలిస్టులు ఉద్యమాలు చేస్తుండగా, వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జగన్ ప్రభుత్వం వెంటనే మరో నియామకాన్ని చేపట్టడంతో పాత్రికేయ సమాజం నిర్ఘాంతపోతోంది.
ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఓఎస్డీ హోదాలో జర్నలిస్టు అరవింద్ యాదవ్ విధులు నిర్వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు.
మీడియా రంగంలో 24 ఏళ్ల అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ సాక్షి జర్నలిస్టుగా సుపరిచితుడు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియా సంస్థలలో పనిచేశారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా విధులు నిర్వహించారు. టీవీ9, సాక్షి టీవీ, యువర్ స్టోరీ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పలు హిందీ పుస్తకాలను రచించారు.
అరవింద్ బయోగ్రఫీ అటుంచి.. అసలు మీడియా పబ్లిసిటీనే వద్దనుకునే జగన్ ప్రభుత్వానికి ఇంతమంది మీడియా సలహాదారులు, ఓఎస్‌డీ, సీపీఆర్‌వో, పీఆర్‌వోలు అవసరమా…అని ఇప్పుడు విపక్ష నేతలు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తన 100 రోజుల పాలనలో ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫెరెన్స్ కూడా పెట్టలేదు. మరి ఇంతమందిని తీసుకొచ్చి ఇన్ని మీడియా రిలేటెడ్ పోస్టులు సృష్టించి, వాటికోసం లక్షల్లో వేతనాలు ఎందుకు వెచ్చిస్తున్నట్టోనని ఒక కామెంట్ అన్నివర్గాల్లో వినవస్తోంది.
ప్రభుత్వం తనకు అవసరమని అనుకుంటే ఎన్ని లక్షలైనా వెచ్చించి ఎంతమందినైనా నియమించుకోవచ్చు. అది ప్రభుత్వ విధాన నిర్ణయం ప్రకారం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా క్యాబినెట్ హోదాలో ఒక సలహాదారుని నియమించుకున్నారు. ఆ సలహాదారు తన దగ్గర నలుగురు మీడియా నిపుణులతో ఒక చిన్న బృందాన్ని ఏర్పాటుచేసుకుని నిత్యం మీడియా వ్యవహారాల్లో కీలక భూమిక తీసుకునేవారు. చంద్రబాబు పాల్గొనే అన్ని ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఆయన కూడా సీయం పక్కనే కూర్చుని అవసరమైన సమాచారాన్ని అందిస్తుండేవారు. చంద్రబాబు కూడా తరచూ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించేవారు. ఇది తన పారదర్శక పాలనలో ఒక ప్రచార వ్యూహంగా భావించేవారు.
జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ తనకు అంత ఆడంబరమైన ప్రచారం అవసరం లేదని ఆరంభంలోనే ఘనంగా చెప్పుకుంది. ఆ వెంటనే తన పేషీలో క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ సాక్షిలో పనిచేసే జీవీడీ కృష్ణమోహన్‌ను సలహాదారుగా నియమించుకుంది. తనతోపాటు సాక్షిలో పనిచేసే మరికొందరిని జీవీడీ తన బృందంలో నియమించుకున్నారు. వీరిలో సీసీఆర్వోగా పూడి శ్రీహరి నియామకంపై ఇప్పటికే ప్రభుత్వం ఉత్వర్వు రాగా, బృందంలోని మిగిలిన వారికి సమాచార శాఖ ద్వారా త్వరలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు.
ఇక, సీయం పేషీలో కొన్నాళ్లకు మరో సలహాదారు వచ్చారు. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన కూడా సాక్షి కుటుంబానికి చెందిన మనిషే. అక్కడ ఎడిటోరియల్ డైరెక్టర్‌గా వుంటూ జగన్‌కు తొలి నుంచి ముఖ్య అనుచరులలో ఒకరిగా వున్నారు. ఇక నియామకాల సిరీస్‌లో వివాదస్పదంగా మారిన తాజా పేరు దేవులపల్లి అమర్. తెలంగాణ ప్రాంతానికి చెందిన అమర్ జర్నలిస్టు ఉద్యమాలకు సారధిగా ఉన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అమర్ చూపే చొరవ ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.
సాక్షిలో కన్సల్టింగ్ ఎడిటర్‌గా చాలాకాలం పనిచేసిన వైసీపీ వాయిస్ వినిపించే జర్నలిస్టుగా అమర్ సాక్షి టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడు. అలాంటి వ్యక్తిని ఢిల్లీలో మీడియా వ్యవహారాల సలహాదారుగా జగన్ నియమించుకోవడం ఎంతమాత్రం తప్పుకాదు. కాకపోతే.. అమర్ పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడమే ఇక్కడ పలువురి అభ్యంతరం. ఈ నేలపై కొలువులు ఈ నేలమీద పుట్టినవారివే.. అనే నినాదం, విధానం ఈ ప్రభుత్వానిది అయినప్పుడు పక్క రాష్ట్రం వారికి పదవులు పంపకం ఎలా చేస్తారనేదే ప్రశ్న.
ఇలావుంటే.. తెలంగాణా ఉద్యమం సమయంలో విషం చిమ్మే వ్యాఖ్యలు చేసి, విద్వేషం రగిల్చే ఉద్యమాలకు నాయకత్వం వహించాడని అమర్ మీద ఇప్పుడు ఏపీ జర్నలిస్టులు చేస్తున్న ఆరోపణ. దీనిపై పోరాడుతున్న తనపై కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని విజయవాడకు చెందిన జర్నలిస్టు పులిగడ్డ సత్యనారాయణ ఆరోపించడం తాజాగా వివాదస్పదమవుతోంది. దీనిపై ఎంతవరకైనా ఎదురీదుతానని, ఇటువంటి బెదిరింపులకు వెనకడుగు వేసే సమస్యే లేదని పులిగడ్డ చెబుతున్నారు.
ఇలావుంటే, జీవీడీ కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రాలుగా జగన్ పేషీ సర్కారులో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయని ఒక టాక్. సాక్షి జర్నలిస్ట్ అమర్ దేవులపల్లి వ్యవహారంతో ఈ వర్గపోరు మరింత ముదిరిందని అంటున్నారు. అమర్ వద్దు అని ఒక వర్గం, లేదు కావాల్సిందే అనే మరో వర్గం పట్టు బట్టింది. చివరకు మధ్యే మార్గంగా అమర్‌తో పాటు జాతీయ మీడియా వ్యవహారాలకు ఓఎస్‌డీగా అరవింద్ యాదవ్‌ను తాజాగా నియమించారు. మరోవైపు అమరావతి నుంచి కీలక భూమిక పోషించాలని YV సుబ్బా రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తూనే వున్నారు. ప్రస్తుతం ఆయన టీటీడీ క్యాంప్ ఆఫీసును తాడేపల్లి సమీపంలో ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో వున్నారు. ఈ క్యాంపాఫీస్ కేవలం శ్రీవారి సేవ కోసమే తప్ప తన వారి సేవ కోసం కాదని ఆయన ఇప్పటికే మీడియాకి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఎక్కువ రోజులు తిరుమలలో కాకుండా తాడేపల్లిలోనే వుంటుండటం వైవీ స్పెషాలిటీ.
ఇలావుంటే,, సాక్షిలో మరికొందరు ముఖ్యులు కూడా త్వరలో ఏపీ ప్రభుత్వంలో కొలువులు అందుకోనున్నారని చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మ్యాగజీన్ బాధ్యతల్ని సాక్షి పత్రికలో ప్రశ్నలకు జవాబులిచ్చే శీర్షిక నిర్వహించే ఒకరికి అప్పజెప్పబోతున్నారని, మరో నలుగురు జర్నలిస్టులకు కూడా ఇక్కడ స్థానం కల్పిస్తారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక అవసరం లేదని ఇప్పటికే తేల్చిచెప్పిన ముఖ్యమంత్రిని ఒప్పించి మళ్లీ ఆ పత్రికను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఇలావుంటే.. మన టీవీ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే అంశం ప్రస్తుతం నాలుగు స్థంభాల వర్గ పోరు మధ్య నలుగుతోందని తెలుస్తోంది. మనటీవీ బాధ్యతల్ని గతంలో మహాటీవీ సీఈవోగా పనిచేసిన అనిల్ ఇనగంటి చూసేవారు. ఆశ్రితులైన జర్నలిస్టులకు ఏవో కొలువులు, బాధ్యతలు అప్పగించడం గతం నుంచి వున్న సంప్రదాయమే.
మళ్లీ మేటర్‌లోకి వస్తే.. ఇప్పుడు టోటల్‌గా సీయం పేషీలో రెండు వర్గాలు, బయటి నుంచి మరో రెండు వర్గాలు మీడియా రిలేటెడ్ నియామకాల వ్యవహారాల్లో తలదూర్చి… అసలు మీడియా ప్రచారమే ఇష్టపడని జగన్ సర్కారుపై ఖజానా భారం పెంచుతున్నారనే కామెంట్ వినిపిస్తోంది.