– ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కామన్ సివిల్ కోడ్ ను తీసుకు వస్తామని అన్నారు. ఓ ఆంగ్ల ఛానల్ తో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కామన్ సివిల్ కోడ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
‘ ఈ చట్టం సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది. లింగ వివక్షను దూరం చేస్తుంది. మహిళా సాధికారతను అది మరింత బలోపేతం చేస్తుంది. రాష్ట్ర అసాధారణ సాంస్కృతిక-ఆధ్యాత్మిక గుర్తింపును, పర్యావరణాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది” అని అన్నారు.
‘ ఇప్పుడు నేను చేయబోయే ప్రకటన మా పార్టీ తీర్మానం. ‘దేవభూమి’ సంస్కృతి, వారసత్వాన్ని చెక్కుచెదరకుండా ఉంచడం మా పార్టీ ప్రధాన కర్తవ్యం. మేము దీనికి కట్టుబడి ఉన్నాము. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని నెరవేర్చేందుకు చర్యలు మొదలు పెడతాం. వీలైనంత త్వరగా ఓ కమిటీని ఏర్పాటు చేసి బిల్లుకు సంబంధించి డ్రాఫ్ట్ ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటాము” అని వెల్లడించారు.
సీఎం ప్రకటనను బీజేపీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ ఎన్నికల తర్వాత దేవభూమిలో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని సీఎం ధామీ ప్రకటించారు. అలా చేస్తే గోవా తర్వాత సివిల్ కోడ్ అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఉత్తరాఖండ్ మారతుంది” అని ట్వీట్ లో పేర్కొన్నారు.