ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోలీస్, ఆబ్కారీ అధికారులు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రులు, పోలీసులు, ఆబ్కారీశాఖల అధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం నియంత్రణపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డ్రగ్స్ కట్టడిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సమూలంగా డ్రగ్స్ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలని అధికారులకు సీఎం సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు.
సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే డ్రగ్స్ కట్టడి సాధ్యమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ప్రజల్లో చైతన్యం కోసం సృజనాత్మక కార్యక్రమాలు తేవాలని అధికారులను ఆదేశించారు. వెయ్యి మంది సుశిక్షితులైన సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
డ్రగ్స్ నియంత్రించే విభాగం శక్తిమంతంగా పనిచేయాలని అధికారులను కోరారు. అద్భుత పనితీరు కనబరిచే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. డ్రగ్స్ కట్టడిలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. నేరస్థుల విషయంలో నాయకుల సిఫారసులు తిరస్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
దీనికి ముందు పోలీసు అధికారలతో డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. డ్రగ్స్ విక్రేతలు, వాడకందారులపై తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ చర్చించారు. అందుకు సంబందించిన నివేదికను సీఎంకు అందించారు డీజీపీ మహేందర్ రెడ్డి