ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారంతో పాటు.. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు.. స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు.
ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్.. ఎస్పీని ఆదేశించారు జగన్. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వారికి వైద్యా పరిక్షలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని అన్నారు జగన్.
బుధవారం అర్ధరాత్రి సమయంలో రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో 13 మందిని విజయవాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.