కేరళతో పాటు భారతదేశాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ పినరయి విజయన్ సీఎంతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని స్వప్నా బాంబు పేల్చింది.
2016లో సీఎం యూఏఈ పర్యటనలో ఉన్న సమయంలో శివశంకర్ తనను సంప్రదించి యూఏఈకి ఒక బ్యాగ్ డెలివరీ చేయమని అడిగారని చెప్పింది. స్కాన్ చేసినప్పుడు అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయని కూడా ఆమె తెలిపింది. “ఎమర్జెన్సీ ప్రాతిపదికన దుబాయ్ లో డెలివరీ చేయాల్సిన బ్యాగ్ ను సీఎం మరచిపోయారని.. మొదటిసారిగా శివశంకర్ నన్ను సంప్రదించారు.. బ్యాగ్ మాకు డెలివరీ చేయబడింది మరియు బ్యాగ్ ను యూఏఈ కి తీసుకెళ్లడానికి మేము దౌత్యవేత్తను పంపాము. బ్యాగ్ లో కరెన్సీలు ఉన్నాయి. మేము తిరువనంతపురంలోని కాన్సులేట్ లో స్కానర్ ని కలిగి ఉన్నాము” అని ఆమె చెప్పింది.
“ప్రాణహాని ఉన్నందున, వాంగ్మూలాన్ని నమోదు చేసి కోర్టును ఆశ్రయించాను. నేను రక్షణను కూడా కోరాను. త్వరలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్, ముఖ్యమంత్రి, అతని భార్య కమల, అతని కుమార్తె రీనా, అతని కార్యాలయ కార్యదర్శి లకు ఈ కేసులో ఉన్న ప్రమేయాన్ని నేను కోర్టుకు వెల్లడించాను” అని చెప్పింది స్వప్న. అయితే.. ఈ కేసులో కేరళ సీఎం కు సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు పదేపదే ఆరోపణలు చేయడం.. ఇప్పుడు స్వప్న సురేష్ ఆరోపించడం.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
విదేశాల నుంచి వందల కేజీల బంగారు బిస్కెట్లు అక్రమంగా రవాణా చేశారనే ఆరోపణలతో స్వప్నతో పాటు.. ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన కోర్టు తాజాగా.. షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది. అయితే.. బెయిల్ పై వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉన్న స్వప్న.. కేరళ సీఎంతో పాటు ఆయన భార్య, కూతురికి గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చెయ్యడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
స్వప్న సురేష్ చేసిన ఆరోపణలపై సీఎం విజయన్ స్పందించారు. తనపై, తన ప్రభుత్వంపై సంకుచిత రాజకీయ కారణాలతో కొన్ని వర్గాల వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇది రాజకీయ ఎజెండాలో భాగమని ఆరోపించారు. ఇలాంటి ఎజెండాలను ప్రజలు తిరస్కరిస్తారని పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ రాజకీయ నాయకత్వం యొక్క సంకల్పాన్ని బద్దలు కొట్టవచ్చని వారు భావిస్తే.. అది వ్యర్థమేనని వ్యాఖ్యానించారు. చాలా కాలంగా ప్రజా క్షేత్రంలో ప్రజలతో మమేకమై పాలన సాగిస్తున్న తమపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు విజయన్.