ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. అందులో భాగంగా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో 46 స్థానాల్లో బిజేపి గెలిచింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ.. ఇప్పుడు జరుగుతున్న స్థానాలకు కలుపుకొని 292 స్థానాల్లో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కీలకమైన పూర్వాంచల్ ప్రాంతంలోని 111 అసెంబ్లీ స్థానాలపైనే అందరి దృష్టి పడింది.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్ పుర్ లోని గోరఖ్ నాథ్ కన్యానగర్ క్షేత్రలోని ప్రైమరీ స్కూల్ లో ఆయన ఓటేశారు. అయితే.. గోరఖ్ పుర్ స్థానం నుండే యోగి బరిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంఎల్సీ గా ఉన్న సీఎం యోగి ఆదిత్యనాధ్.. తొలిసారిగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగారు. అయితే.. తనకు వ్యతిరేకంగా సమాజ్ వాది పార్టీ అభ్యర్గిగా బీజేపీ మాజీ నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య పోటీలో ఉండటం విశేషం.
గోరఖ్ పూర్ లోకసభ స్థానం నుంచి 5 సార్లు ఎంపీ ఎన్నికయ్యారు యోగి. అయితే.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాధా మోహన్ దాసు అగర్వాల్ 60 వేల ఓట్ల మెజారిటీ తో గెలుపోందారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి స్వయంగా సీఎం పోటీలో ఉండటంతో.. గోరఖ్ పూర్ లోకసభ స్థానం పరిధిలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాల్లోనూ భారీ మెజారిటీతో బీజేపి గెలుస్తుందనే అంచనాలున్నాయి. 2017 ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపి గెలిచింది.
ఈ విడత లో సుమారు 30 అసెంబ్లీ స్థానాల్లో ఇతర వెనుకబడిన కులాల వారు బీజేపీ నుండి పోటీలో ఉన్నారు. నిషాద్ పార్టీతో పొత్తు ఉన్నందున.. బలమైన “మల్లా” ( పడవ నడిపే సామాజిక వర్గం) సామాజిక వర్గం తమకు అండగా ఉంటోందని బీజేపీ భావిస్తోంది. అయితే.. ఈ విడతలో సీఎం యోగితో పాటు.. తంకుహి రాజ్ స్థానం నుంచి యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ పోటీ చేస్తున్నారు. బన్స్ ది స్థానం నుంచి ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ నాయుకుడు రాం గోవింద్ చౌధురి పోటీలో ఉన్నారు. ఫజిల్ నగర్ నుంచి సమాజ్ వాది పార్టీకి చెందిన మరో ముఖ్యనేత స్వామి ప్రసాద్ మౌర్య పోటీ చేస్తున్నారు.
వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు అంతా ఈ విడతలోనే పోటీలో ఉండటం గమనార్హం. అంతేకాకుండా పలువురు మంత్రులు సైతం ఈ విడతలో పోటీలో ఉన్నారు. తమ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 7న చివరి విడత ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న తుదిఫలితాలు వెలువడనున్నాయి.