గుండెపోటుతో మరణించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతం రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు సీఎం జగన్. భారతితో కలిసి వెళ్లిన జగన్.. గౌతం రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన పార్థివదేహం దగ్గర పుష్పగుచ్ఛంతో అంజలి ఘటించారు.
తండ్రి రాజమోహన్ రెడ్డిని ఓదార్చారు జగన్. గౌతం రెడ్డి మృతి తీరనిలోటు అని అన్నారు. ఆత్మీయుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దుబాయ్ ఎక్స్ పో నుంచి ఆదివారమే నగరానికి వచ్చారు గౌతం రెడ్డి. ఉదయం నిద్ర లేచాక గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా కాపాడలేకపోయారు.
మంగళవారం సీఎం జగన్ అపాయింట్ మెంట్ తీసుకున్నారు గౌతం రెడ్డి. దుబాయ్ పర్యటన వివరాలు చెప్పేందుకు టైమ్ అడిగారు. అంతలోనే ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.