అసెంబ్లీలో బడ్జెట్ సమర్పణపై ఉత్కంఠ వీడడంతో సీఎం కేసీఆర్ మంత్రులు,అధికారులతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. సీఎంతో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, అధికారులు భేటీ అయ్యారు.
మరోసారి బడ్జెట్ సమావేశాల తేదీలపై సీఎం, మంత్రులు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ తేదీలను సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. అంతకు ముందు హైకోర్టు సూచనలతో రాష్ట్ర బడ్జెట్ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం,గవర్నర్ మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది.
బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరకు ఇటు ప్రభుత్వ, అటు రాజ్ భవన్ తరపు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు.
అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగబద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కూడా అంగీకరించినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. అలాగే అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతించనున్నట్లు రాజ్ భవన్ న్యాయవాది అశోక్ ఆనంద్ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు విచారణ ముగించింది.