ఐపీఎల్ 2022 సీజన్ జోరుగా సాగుతోంది. టీంల మధ్య ఆసక్తికర పోటీ అభిమానులకు కావల్సినంత మజా అందిస్తోంది. కాగా, కొన్ని టీంలు వరుస విజయాలను అందుకుంటుంటే.. మరికొన్ని వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆయా టీంల కెప్టెన్‌లపై పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యలో ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాను పలువురు విమర్శిస్తుండగా.. పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సే రవీంద్ర జడేజాకు మద్ధతుగా నిలించారు.
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగు ఓటములను చవిచూసింది. అయితే, కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజాకు సభ్యులు అందరూ మద్దతుగా నిలుస్తున్నారని బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సే తెలిపారు. తాము కనీసం కొన్ని విజయాల కోసం చూస్తున్నామని.. అప్పుడు జడేజాపై కెప్టెన్సీ ఒత్తిడి తగ్గి, మరింత రిలాక్స్ అవుతాడని హస్సే చెప్పారు.
‘జడేజాను కెప్టెన్ చేయడం అన్నది పెద్ద మార్పే. ఎంఎస్ ధోనీ ఎంతో కాలంగా కెప్టెన్ గా పనిచేయడమే కాకుండా, చక్కగా రాణించాడు. గొప్ప విషయం ఏమిటంటే జడేజాకు సాయం చేసేందుకు ధోనీ ఇప్పటికీ జట్టుతోనే ఉన్నాడు. నాకు తెలిసి జడేజా, ధోనీ కెప్టెన్సీ గురించి రోజూ మాట్లాడుకుంటారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగే విషయమై వారు చర్చించుకుంటారు. జడేజాను ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారు. కొన్ని విజయాలతో అతడిపై ఒత్తిడి తగ్గిపోతుంది. త్వరలోనే విజయాలు నమోదు చేస్తామనే ఆశతో ఉన్నాం’అని హస్సే వివరించారు.
ఈ సీజన్‌లో చెన్నై.. తొలి మ్యాచులో కేకేఆర్ చేతిలో ఓడింది. ఆ తర్వాత వరుసగా.. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. 2010 తర్వాత సీఎస్కే వరుసగా నాలుగు మ్యాచులు ఓడటం ఇదే తొలిసారి. కాగా, మంగళవారం ఆర్సీబీతో సీఎస్కే తలపడనుంది. ఇది ఈ సీజన్‌లో సీఎస్కేకు ఐదో మ్యాచ్ అవుతుంది.