అది తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణి బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్. కస్టమర్లు ఒకరొకరుగా వస్తూ పోతూ ఉన్నారు. ఓ కస్టమర్ ఎప్పుడొచ్చాడో తెలియదు. ఓ ఐదడుగులు ఉంటాడు. పాక్కుంటూ హోటల్ వెనుకభాగం నుంచి వచ్చాడు.
మెయిన్ ఎన్ట్రన్స్ నుంచి వచ్చిన వాణ్ణి పట్టించుకోవడమే అంతంతమాత్రం. మరి హోటల్ వెనుకనుంచి కిచెన్లోకి వస్తే ఎవరు గుర్తిస్తారు చెప్పండి.! వచ్చి ఇంతసేపవుతున్నా ఎవరు పట్టించుకోరేంటని అప్పుడప్పుడూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేసేవాడు నోటితో మాత్రం కాదండోయ్.
అక్కడి గిన్నెలతో బడబడమని శబ్ధాలు చేసేవాడు. ముందు హోటల్ వర్కర్స్ పెద్దగా పట్టించుకునేవారు కాదు.ఈ సారి అదేపనిగా అక్కడున్న గిన్నెలు, సామాన్లు చెదరగొట్టి పెద్ద హడావుడి చేసాడు. దీంతో కంగారు పడి చూగబగబా వెనక్కి వెళ్ళి కస్టమర్ని చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఎందుకు కారు.! ఆ ఐదడుగుల కస్టమర్ మరెవరో కాదు నాగుపాము. దెబ్బతో కస్టమర్ల సహా హోటల్ వాళ్ళంతా బిలబిలా బైటకు పరుగులు తీసారు. అయితే వెంటనే హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. వారు ఘటనాస్థలికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.