వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బోండాల షాపులు ఎక్కడున్నాయా? అని వెతికేస్తాం. కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. అందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అలాగే కొబ్బరి పాలతోనూ మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయనేది చాలా కొద్దిమందికే తెలుసు. కొబ్బరి నీళ్ల మాదిరిగానే పాలలోనూ అనేక పోషక విలువలు ఉంటాయి.
కొబ్బరి పాలు యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటాయి. అవి శరీరంలోని వైరస్ లతో ఫైట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను కూడా నియంత్రిస్తాయి. ముఖంపై ఉండే చిన్నపాటి హోల్స్, బ్లాక్ స్పాట్స్ ను తగ్గించడంలోనూ కొబ్బరి పాలు ఉపయోగపడతాయి.
కొబ్బరి పాలలో విటమిన్ సీ అధికంగా ఉండడంతో చర్మంపై ముడతలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఎండాకాలంలో చర్మ సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు కొబ్బరి పాలను 20-30 నిమిషాల పాటు చర్మంపై నేరుగా రాసుకుంటే.. ఎప్పుడూ తేమగా ఉంటుంది.
అంతేకాదు.. కొబ్బరి పాలతో స్నానం చర్మాన్ని మరింత తేమగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. గులాబీ రేకులు, రోస్ వాటర్, కొబ్బరి పాలను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేస్తే.. చర్మం ఎంతో సాఫ్ట్ గా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. చర్మ శోథ, సోరియాసిస్, పొడి చర్మ సమస్యలను తగ్గించడంలో కొబ్బరి పాల పాత్ర చాలా కీలకమని అంటున్నారు.